పార్టీల్లోని నల్లడబ్బును ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: దేశంలో 2005 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కేవలం కాగితాలకే పరిమితమైన దాదాపు 200 రాజకీయ పార్టీలను పన్ను మినహాయింపు ప్రయోజనాల జాబితాల నుంచి తొలగించాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు నివేదిస్తూ సిఫార్సు చేయాలని ఇప్పుడు నిర్ణయించినట్లు తెల్సింది. నల్లడబ్బుకు, హవాల కార్యకలాపాలకు ఈ పార్టీలు నిలయాలవుతున్న సంగతి అందరికి ఎరుకే.
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముందుగా రాజకీయ పార్టీలకు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న నల్లడబ్బును అరికట్టాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ అంశంపై మోదీ ప్రభుత్వం ఇంతవరకు పెదవి విప్పకపోయినా ఎన్నికల కమిషన్ కాస్త చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగానే ప్రస్తుతమున్న 20 వేల రూపాయల లోపు వచ్చే విరాళాలకు సోర్స్ చెప్పాల్సిన అవసరం లేదన్న నిబంధనను రెండు వేల రూపాయలకు మాత్రమే పరిమితం చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
రాజకీయ పార్టీలకు ఆ చిత్తశుద్ధి ఉందా?
రెండు వేల రూపాయల మాట దేవుడెరుగు. 20వేల రూపాయలకు పైగా వచ్చే విరాళాల సోర్స్‌ను వెల్లడించాలన్న నిబంధనలను పాలక, ప్రతిపక్ష పార్టీలు సహా ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇప్పటికీ పాటించడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు పౌరుల సమాచారా హక్కులను చిత్తశుద్ధితో గౌరవించాలంటూ కేంద్ర సమాచార కౌన్సిల్ 2013లో ఇచ్చిన తీర్పును కూడా ఏ రాజకీయ పార్టీలు ఖాతరు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
73 శాతం విరాళాలు నల్లడబ్బే
2004 సంవత్సరం నుంచి 2013 సంవత్సరం మధ్య దేశంలోని పలు జాతీయ రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల్లో 73 శాతం నల్లడబ్బేనని ‘అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్’ ఓ నివేదికలో వెల్లడించింది. రాజకీయ విరాళాల్లో నల్లడబ్బును నియంత్రించేందుకు గతంలో జరిగిన పలు ప్రయత్నాలను పాలక, ప్రతిపక్షం అనే తేడా లేకుండా పలు ప్రధాన జాతీయ పార్టీలు అడ్డుకున్నాయి. 1998లో ఎన్నికల ఫండింగ్ కోసం టాటా కంపెనీ ముందుకు వచ్చింది. కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఏ పార్టీకి ఎంత ఫండింగ్ చేయాలో నిర్ణయించేందుకు పౌర ప్రముఖులతోనే ఓ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఆ ప్రతిపాదన అప్పట్లోనే చిత్తు కాగితాల్లో కలసి పోయింది.
మోదీ నోట స్టేట్ ఫండింగ్ మాట
ఎన్నికల సంస్కరణలో భాగంగా స్టేట్ ఫండింగ్ (ప్రభుత్వ నిధులు) అంశంపై చర్చించాలని పెద్ద నోట్లకు రద్దుకుముందే ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఆ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం మంచిది కాదని, స్టేట్ ఫండింగ్ మంచిదని నాడు జస్టిస్ వాంచూ కమిటీ కూడా సిఫార్సు చేసింది. స్టేట్ ఫండింగ్ అని పిలవడం తప్పనేవారు కూడా ఉన్నారు. ప్రజల పన్నుల ద్వారా ప్రభుత్వానికి చెల్లించే సొమ్మును ప్రభుత్వం సొమ్ముగా ఎలా పరిగణిస్తారని, రాజీకీయ పార్టీలకు ప్రభుత్వం కేటాయించే నిధి కూడా ప్రజా నిధే అవుతుందని వారు వాదిస్తున్నారు. ఇప్పటికే తొందరపాటు నిర్ణయంతో ప్రజాధరణ కోల్పోతున్న మోదీ, రాజకీయ పార్టీల్లోని నల్లడబ్బుపై బాణం ఎక్కు పెడతారా అన్నది ప్రశ్న.