న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ తొలి దశ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో 302 మంది కోటీశ్వరులున్నారని, 168 మంది తమపై క్రిమినల్ కేసులున్నాయని ప్రకటించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. బీఎస్పీ తరఫున పోటీచేస్తున్న 73 మందిలో 66 మంది, బీజేపీ 73 మందిలో 61 మంది, 51 మంది ఎస్పీ అభ్యర్థుల్లో 40 మంది తమ ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అనే సంస్థ నివేదిక బహిర్గతం చేసింది.
యూపీ తొలి దశ ఎన్నికల పోటీలో ఉన్న 836 అభ్యర్థుల వివరాలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక ముఖ్యాంశాలు...అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.2.81 కోట్లు. 143 మంది అభ్యర్థులు తమపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన క్రిమినల్ నేరాలు ఉన్నాయని తెలిపారు. 186 మంది తమ పాన్ వివరాలు వెల్లడించలేదు. ఫిబ్రవరి 11న ఈ పోలింగ్ జరుగుతుంది.