
ఆ ఎమ్మెల్యేలలో 97% కోటీశ్వరులే!
దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన పోలింగ్, 10న ఫలితాల వెల్లడి ఉంటుంది. అయితే.. ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల చరిత్రలు చూస్తే.. వాళ్లలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యేల్లో 97 శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 31 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అందులో 30 మందికి సగటున 12 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులున్నాయి. అలాగే, వాళ్లలో మొత్తం 17 మందికి నేర చరిత్ర కూడా ఉంది. ఈ విషయం వాళ్లు ఇచ్చిన అఫిడవిట్లలోనే ఉంది.
49 రోజుల పాటు అధికారంలో కూర్చున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తక్కువేమీ తినలేదు. ఆ పార్టీకి ఉన్న 28 మందిలో 12 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. వీళ్ల సగటు ఆస్తి కోటి రూపాయలు. ముగ్గురి మీద క్రిమినల్ కేసులున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలుచుకుంది. వాళ్లలో ఏడుగురు.. అంటే 88 శాతం మంది కోటీశ్వరులు. వాళ్ల సగటు ఆస్తి 10కోట్ల రూపాయలకు పైనే. వీళ్లలో ఇద్దరి మీద క్రిమినల్ కేసులున్నాయి.