గెలవకపోతే నేతలను కొనడమే బెటర్
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలవని చోట గెలిచిన వాళ్లను కొనుక్కోవడమే ఉత్తమమైన మార్గంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావిస్తున్నట్లుంది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఈ సూత్రం అక్షరాల ఫలించడంతో ఇప్పుడు ఢిల్లీలోని ఆప్ పార్టీపై కన్నేసింది. అందులో భాగంగానే వారం రోజుల క్రితం ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్‌ను పార్టీలో చేర్చుకొంది. మరి కొంత మంది ఆప్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే బేరసారాలు నడుస్తున్నాయని ఇరు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఓ పద్ధతిగా పావులు కదుపుతోందని, ఈ విషయంలో తొందరపడితే ఆప్‌కే లాభం జరిగే ప్రమాదం కూడా ఉంటుందికనుక ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీజేపీ నాయకుడొకరు తెలిపారు. ఆప్‌ను బలహీనం చేయడం ద్వారా ప్రస్తుతం జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడంతోపాటు వచ్చే జనవరి నెలలో ఢిల్లీ నుంచి ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ సీట్లలో ఒక్కటైన దక్కించుకోవాలన్నది అమిత్ షా వ్యూహంగా తెలుస్తోంది.
పార్లమెంటరీ సెక్రటరీగా నియమితులైన 21 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని కూడా బీజేపీ ఆశిస్తోంది. జోడు పదవుల ద్వారా లబ్ధి పొందుతున్నారన్న కారణంగా ఈ అంశంపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపింది. ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే ఆ స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పుడు ఎక్కువ సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్న విశ్వాసం కూడా బీజేపీలో కనిపిస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీకి చెందిన జనార్దన్ ద్వివేది, కరణ్ సింగ్, పర్వేజ్ హాష్మి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే జనవరి నెలల్లో వీరి సీట్లు ఖాళీ అవుతాయి. ప్రస్తుతం ఆప్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల మూడు సీట్లు ఆప్‌కే దక్కాల్సి ఉంది. ఈ లోగా ఆప్‌ను అన్ని విధాల బలహీనపరిచి అన్ని విధాల లబ్ధి పొందాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది.