
భూమి కోల్పోయిన వారికి చెక్కులు అందచేస్తున్న అరుణాచల్ సీఎం
సాక్షి, ఈటానగర్ : ఈశాన్య రాష్ట్రాల్లోని ఆ చిన్ని గ్రామం..నిన్నమొన్నటి వరకూ గ్రామీణ భారతాన్ని ప్రతిబింబించే సగటు పల్లెటూరు. కాయకష్టం చేసి పొట్టపోసుకునే గ్రామస్తులే అడుగడుగునా కనిపిస్తారు. అయితే రాత్రికి రాత్రే వారంతా ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని బోంజా గ్రామంలో ఇప్పుడు అంతా సంపన్నులే. వారంతా ఆసియా దేశాల్లో సంపన్నుల సరసన నిలిచారు. వీరికి అనూహ్యంగా ఇంత సంపద ఎలా వచ్చి పడిందనేగా సందేహం. భూసేకరణలో భూమి కోల్పోయిన వారికి రక్షణ మంత్రిత్వ శాఖ అందించిన పరిహారంతో వీరంతా కోటీశ్వరులయ్యారు.
గ్రామంలోని 31 కుటుంబాలకు రూ 40.83 కోట్ల పరిహారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. 200 ఎకరాల భూమిని సేకరించినందుకు ఈ పరిహారాన్ని చెల్లించారు. నష్టపరిహారం పొందిన వారిలో ఓ వ్యక్తికి రూ 6.73 కోట్లు రాగా, ఓ కుటుంబానికి రూ 2.44 కోట్లు అందాయి. 31 కుటుంబాల్లో 29 కుటుంబాలకు రూ కోటి 9 లక్షల పైనే పరిహారం దక్కింది. దీంతో గ్రామస్తులంతా కోటీశ్వరులైన గ్రామంగా బోంజా రికార్డులకెక్కింది. రక్షణ శాఖ కీలకస్ధావర ప్రణాళికా యూనిట్లను నెలకొల్పేందుకు ఈ భూమిని సేకరించారు. అరుణాచల్ సీఎం పెమా ఖండూ స్థానికులకు పరిహారం చెక్కులను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment