న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ చివరి దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. మార్చి 10న ఓట్లను లెక్కిస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మంది నేరచరితులు, 41 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో 18 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
నేర చరితులకు పెద్దపీట
ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 6,944 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 6,874 మంది అఫిడవిట్లను పరిశీలించామని, మిగతా 70 మంది అఫిడవిట్లను విశ్లేషించాల్సి ఉందని ఏడీఆర్ తెలిపింది. ఈ 6,874 మందిలో 1,916 మంది జాతీయ పార్టీలకు, 1,421 మంది ప్రాంతీయ పార్టీలకు, 1,829 మంది గుర్తింపులేని పార్టీలకు చెందిన వారు. 1,708 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు.
6,874 అభ్యర్థుల్లో 1,694 మంది(25 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్వయంగా వెల్లడించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్టు 1,262 మంది (18 శాతం) మంది అఫిడవిట్లలో పేర్కొన్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నవారు.. వీరిలో ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి చూస్తే అన్ని పార్టీలకు నేరచరితులకు పెద్దపీట వేసినట్టు స్పష్టమవుతోంది.
పోటీలో కోటీశ్వరులు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో 41 శాతం మంది(2,836) కోటీశ్వరులు పోటీలో ఉన్నారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్(1,733), పంజాబ్(521), ఉత్తరాఖండ్(252), గోవా(187), మణిపూర్(143) వరుస స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రాల వారీగా అభ్యర్థుల సగటు ఆస్తులను పరిగణనలోకి తీసుకుంటే గోవా ముందజలో నిలిచింది. పంజాబ్, యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పార్టీల పరంగా చూస్తే 93 శాతంతో అకాలీదళ్ అగ్రస్థానంలో ఉంది. బీజేపీ(87 శాతం), ఆర్‌ఎల్‌డీ(66), ఎన్‌పీఎఫ్(80), ఎస్పీ(75), బీఎస్‌పీ(74), ఏఐటీసీ(65), కాంగ్రెస్(63), ఆప్(44), యూకేడీ(29 శాతం) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. స్వతంత్ర అభ్యర్థుల్లో 347 మంది కోటీశ్వరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ టాప్..
బీజేపీ 534 మంది కుబేరులకు టిక్కెట్లు కట్టబెట్టగా, కాంగ్రెస్ 423 మంది ధనవంతులకు సీట్లు ఇచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీ(349), బహుజన సమాజ్‌వాదీ పార్టీ(312), ఆమ్ ఆద్మీ పార్టీ(248) కూడా కోటీశ్వరులకు పెద్దపీటే వేశాయి. అకాలీదళ్(89), ఆర్‌ఎల్‌డీ(32), ఎన్‌పీపీ(27), తృణమూల్ కాంగ్రెస్(17), పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ(16), యూకేడీ(12) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 13, అప్నా దళ్ (సోనీలాల్) 12, మహారాష్ట్రవాది గోమంతక్ 9, ఎన్‌పిఎఫ్ 8, గోవా ఫార్వర్డ్ పార్టీ ఇద్దరు కోటీశ్వరులను పోటీకి నిలబెట్టాయి.
మహిళలకు దక్కని ప్రాధాన్యం
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కలేదు. 6,874 అభ్యర్థుల్లో కేవలం 11 శాతం(755) మాత్రమే మహిళలు ఉన్నారు. 6,116 మంది పురుషులు, ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు పోటీలో ఉన్నారు. (క్లిక్: తమిళ రాజకీయాల్లో నవ శకం.. డీఎంకే నయా పంథా)
కుర్రాళ్ల నుంచి కురువృద్ధుల వరకు..
వయసు పరంగా చూస్తే 41 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు అత్యధికంగా 54 శాతం(3,694) మంది ఎన్నికల బరిలో నిలిచారు. 25 నుంచి 40 ఏళ్లలోపు 32 శాతం(2,195) మంది ఉన్నారు. 61 నుంచి 80 ఏళ్లలోపు వయసున్న వారు 14 శాతం మంది ఉన్నారు. 80 ఏళ్లకు పైబడిన కురువృద్ధులు 10 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో ఎవరెవరు విజయం సాధిస్తారనేది మార్చి 10న వెల్లడవుతుంది. (క్లిక్: యూపీలో కీలకంగా మారిన ఓటింగ్ శాతం.. అధికార పార్టీపై ఎఫెక్ట్..?)
Comments
Please login to add a commentAdd a comment