కేసులు, కాసులు ఉంటేనే ఎంపీ సీట్లు
గూండాయిజం, నేరచరిత్ర, దౌర్జన్యం ... ఈ మూడూ ఉంటే చాలు యూపీలో రాజకీయంలో రాణించవచ్చు. ఎన్నికల సంస్కరణలకోసం పొరాడుతున్న అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోటీశ్వరులైనా అయి ఉండాలి లేదా బోలెడన్ని క్రిమినల్ కేసులైనా ఉండాలి.
యూపీలో ఏప్రిల్ 24 న 12 లోకసభ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్ లో 168 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 27 మంది అభ్యర్థులు తమపై క్రిమినల్ కేసులున్నాయిని పేర్కొన్నారు. 58 మంది కోటీశ్వరులు. నేర చరిత్ర ఉన్న 27 మందిలో 19 మందిపై హత్యానేరం కేసులు ఉన్నాయి.
వీరిలో బిఎస్ పీ కి చెందిన వారు ఏడుగురు, సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు అయిదుగురు ఉన్నారు. కాంగ్రెస్, బిజెపిల అభ్యర్థుల్లో చెరి ముగ్గురు నేరచరితులు ఉన్నారు. ఇక స్వచ్ఛమైన రాజకీయాలు, నేర రహిత రాజకీయాల గురించి మాట్లాడే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక నేరచరితుడికి టికెట్ ఇచ్చింది.
కోటీశ్వరుల విషయంలోనూ బిఎస్ పీ దే పై చేయి. బిఎస్ పీ తరఫున 12 మంది, బిజెపి తరఫున 11 మంది, కాంగ్రెస్ తరఫున నలుగురు, ఆమ్ ఆద్మీపార్టీ తరఫున అయిదుగురు కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు. మథుర నియోజకవర్గంలో బిజెపి తరఫున పోటీ చేస్తున్న నటి హేమమాలిని తన ఆస్తి 178 కోట్లుగా పేర్కొన్నారు.