ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులే!
న్యూఢిల్లీ: 16వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతి ముగ్గురు ఎంపీలలో ఒకరు నేరచరితులేనని నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ), అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) పరిశీలనలో వెల్లడైంది. మొత్తం 543 ఎంపీలకు 541 మంది ఎంపీల ఎన్నికల అఫిడవిట్లను న్యూ, ఏడీఆర్ పరిశీలించాయి. వారిలో 186 మందిపై (మొత్తం ఎంపీల్లో 34 శాతం మంది) క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. ఈ 186 మంది ఎంపీల్లో 112 మంది (21 శాతం మంది)పై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు, మతవిద్వేషాలు రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.
పార్టీలవారీగా చూస్తే బీజేపీ నుంచి ఎన్నికైన 281 మంది ఎంపీల్లో 98 మంది (35 శాతం మంది) ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ పేర్కొంది. అలాగే శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 15 మంది, 44 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 8 మంది, 34 మంది తృణమూల్ ఎంపీల్లో ఏడుగురు, 37 మంది అన్నాడీఎంకే ఎంపీల్లో ఆరుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వివరించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 30 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 34 శాతానికి పెరిగింది.