
తాజా షోలో ఇప్పటివరకు ఎవరూ ఏడు కోట్లు గెలుచుకోలేదు. కోటి గెలుచుకోవడమే పెద్ద అచీవ్‌మెంట్. ఆ ‘కోటి’ ఘనతను సాధించిన ముగ్గురూ మహిళలే కావడం విశేషం. కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) గేమ్ షోలో హోస్ట్ అమితాబ్ బచన్ ఎదురుగా ఉండే హాట్ సీట్‌ను టీవీలో మీరు చూసే ఉంటారు. ఆయన నింపాదిగా నవ్వుతూ కనిపిస్తుంటారు. హాట్ సీట్‌లో కూర్చున్నవాళ్లు చప్పుడు లేకుండా, ఆవిరి యంత్రం పనిచేస్తున్నట్లుగా ఉంటారు. కరెక్టు సమాధానాలు చెప్పుకుంటూ పోతుంటే ప్రైజ్‌మనీ పెరుగుతూ పోతోంది. ఒక్క తప్పు సమాధానం చెప్పినా అమౌంట్ డౌన్ అయిపోతోంది. ‘వచ్చిందే చాలులే’ అని, ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయేవాళ్లూ ఉంటారు. ఈ గేమ్ షోలో చివరి వరకు కరెక్టు సమాధానాలన్నీ చెప్పుకుంటూ పోతే ఏడు కోట్ల రూపాయలు గెలుచుకోవచ్చు. ఈ ఏడాది కేబీసీ సీజన్– 12 సెప్టెంబర్ చివరిలో మొదలైంది. ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభంలో స్టార్ టీవీ ప్రసారం చేసిన ఈ షోను 2010 నుంచీ సోనీ టీవీ ఇస్తోంది. ఇప్పుడీ తాజా షోలో ఇప్పటివరకు ఎవరూ ఏడు కోట్లు గెలుచుకోలేదు. కోటి గెలుచుకోవడమే పెద్ద అచీవ్‌మెంట్. ఆ ఘనతను ఈ సీజన్‌లో తొలిసారి నవంబర్ పదకొండున 20 ఏళ్ల నజియా నసీం సాధించారు. కోటి సాధించిన తక్కిన ఇద్దరూ కూడా మహిళలే.
మోహితా శర్మ నవంబర్ పద్దెనిమిదిన, నవంబర్ ఇరవై ఐదున అనుపాదాస్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. 42 ఏళ్ల అనుప స్కూల్ టీచర్. చత్తీస్‌గఢ్ నుంచి వచ్చారు. తల్లికి క్యాన్సర్ చికిత్స చేయించడం కోసం కొంతకాలంగా ఆమె ముంబైలో ఉంటున్నారు. 31 ఏళ్ల మోహితా శర్మ ఐపీఎస్ ఆఫీసర్. ఆమెది ఢిల్లీ. జమ్ముకశ్మీర్‌లో ఉద్యోగం. తొలి కోటి విజేత నజియా నసీమ్ ఢిల్లీలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలో కమ్యూనికేషన్ మేనేజర్. జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. కేబీసీ గేమ్ షోలో మొత్తం పదహారు ప్రశ్నలు ఉంటాయి. పదహారు ప్రశ్నలకూ కరెక్టుగా సమాధానాలు చెప్పుకుంటూ పోతే ఏడు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. కోటి రూపాయలు గెలుచుకోవడం కూడా తేలికేం కాదు. పదిహేనవ ప్రశ్న వరకు వెళ్లాలి. పదిహేనవ ప్రశ్నకు కరెక్టు జవాబు చెప్పాలి. అంటే.. కోటికీ, ఏడు కోట్లకు మధ్య ఉన్న తేడా ఒకే ఒక ప్రశ్న. సింగపూర్‌లో సుభాష్ చంద్రబోస్ ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ప్రకటించిన ప్రదేశం ఏమిటి? అన్నది తొలి కోటి విజేత నజియా నసీమ్‌కు ఎదురైన ఏడు కోట్ల ప్రశ్న. ఆప్షన్ ఎ) క్యాథీ సినిమా హాల్, బి) ఫోర్ట్ క్యానింగ్ పార్క్, సి) నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, డి) నేషనల్ గ్యాలరీ ఆఫ్ సింగపూర్. (ఆన్సర్ క్యాథీ సినిమా హాల్). నజియాకు కరెక్టుగా తెలీదు. ఊగిసలాట ఎందుకని క్విట్ అయ్యారు. కోటి తీసుకుని గేమ్ నుంచి నిష్క్రమించారు.
రెండో కోటి విజేత మోహితా శర్మకు పదహారవ ప్రశ్నగా ఇంకాస్త కఠినమైన పరీక్షే ఎదురైంది. ముంబైలోని వాడియా గ్రూపు 1817లో నిర్మించిన ఈ కింది నాలుగు బ్రిటిష్ వార్ షిప్‌లలో అతి పురాతనమైనది ఏది? అనేది ఆ ప్రశ్న. ఆప్షన్ ఎ) హెచ్‌ఎంఎస్ మిండెన్, బి) హెచ్‌ఎంఎస్ కార్న్‌వాలిస్, సి) హెచ్‌ఎంఎస్ ట్రింకోమలి, డి) హెచ్‌ఎంఎస్ మియానీ. (కరెక్ట్ ఆన్సర్ హెచ్‌ఎంఎస్ ట్రింకోమలి). ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం తెలియక మోహితా కూడా క్విట్ అయే అవకాశాన్నే ఎంచుకుని కోటీశ్వరిగా హాట్ చెయిర్ దిగారు. మూడో కోటి విజేత అనుపను కంప్యూటర్ అడిగిన ఏడు కోట్ల ప్రశ్న కూడా మరీ అంత సులభమైనదేమీ కాదు. వన్‌డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఏ దేశపు జట్టుకు రియాజ్ పూనావాలా, షౌకత్ దుకాన్‌వాలా ప్రాతినిధ్యం వహించారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఎ) కెన్యా, బి) యు.ఎ.ఇ., సి) కెనడా, డి) ఇరాన్. కరెక్ట్ ఆన్సర్ యు.ఎ.ఇ. అనుప యు.ఎ.ఇ. అనే చెబుదామనుకుని కూడా రిస్క్ ఎందుకని క్విట్ అయి కోటితో సరిపెట్టుకున్నారు. ఏమైనా ఈ ముగ్గురూ సాధించిన విజయం సాధారణమైనది ఏమీ కాదు. చూడాలి ఏడు కోట్ల రూపాయల విజేత కూడా ఒక మహిళే అవుతారేమో.
Comments
Please login to add a commentAdd a comment