వారిలో సగంమంది కోటీశ్వరులే
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో దాదాపు సగమంది కోటీశ్వరులే. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో అత్యధికంగా 83 శాతంమంది కోటీశ్వరులున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం నుంచి కొత్తగా గెలిచిన 812 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్ ప్రతిపాదికగా సర్వే చేసింది. కాగా కొద్దిమంది ఎమ్మెల్యేల వివరాలు మాత్రం అందుబాటులో లేవు.
పుదుచ్చేరిలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 25 మంది కోటీశ్వరులు. ఆ తర్వాతి స్థానం తమిళనాడుది. తమిళనాడులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 76 శాతం మంది కోటీశ్వరులు. 223 మంది ఎమ్మెల్యేల వివరాలను పరిశీలించగా, 170 మంది కోటీశ్వరులని సర్వేలో తేలింది. ఇక అసోంలో 57 శాతం (126 మంది ఎమ్మెల్యేలలో 76 మంది), కేరళలో 44 శాతం (140 మందిలో 61 మంది) ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. ఐదు రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో తక్కువగా 34 శాతం మంది కోటీశ్వరులున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు 133 కోట్ల విలువైన ఆస్తులుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంతకుమార్ ఆస్తుల విలువ 337 కోట్ల రూపాయలు. కొత్త ఎమ్మెల్యేలలో 80 ఏళ్ల పైబడినవారు ఐదుగురు ఉండగా, 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు ఐదుగురు ఎన్నికయ్యారు. మహిళా ఎమ్మెల్యేలు 77 మంది ఉన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి అత్యధికంగా 10 మంది ఎమ్మెల్యేలు పీహెచ్డీ చేశారు.