five statre elections
-
ఈవీఎంలలో లోపాలను తగ్గిస్తాం
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుని రాజకీయ పార్టీలు తప్పుపట్టడం సరికాదని గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. ఈవీఎంల విషయంలో రాజకీయ నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంలలో తలెత్తుతున్న లోపాలు, పొరపాట్లను సాధ్యమయ్యేంత తగ్గించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ‘మేం సంతృప్తి చెందలేదు. కొన్ని సంఘటనలు (పొరపాట్లు, లోపాలు) పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం’అని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం, ఈవీఎంలలో లోపాలు తలెత్తడం రెండు వేర్వేరు అంశాలని అన్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణల్లో జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లో 1.76 లక్షల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల మాత్రమే (ఒక శాతానికి తక్కువే) ఈవీఎంలలో పొరపాట్లు తలెత్తాయని.. ఇంతమాత్రానికే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదన్నారు. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయని వాటిని చూసి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వేర్వేరు ఫలితాలు వచ్చాయని, అంతకుముందు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం రుజువైందని చెప్పారు. ఈవీఎంల విశ్వసనీయతపై రాజకీయ పార్టీల ఆరోపణలపై అరోరా స్పందిచారు. ‘ఓటర్ల తర్వాత రాజకీయపార్టీలే కీలక భాగస్వామి. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా పార్టీలన్ని ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది సరికాదు..’అని అన్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ వైపు మరోసారి దేశం చూడాల్సిన అవసరం రాదని అరోరా పేర్కొన్నారు. -
వారిలో సగంమంది కోటీశ్వరులే
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొత్త ఎమ్మెల్యేల్లో దాదాపు సగమంది కోటీశ్వరులే. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పుదుచ్చేరి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో అత్యధికంగా 83 శాతంమంది కోటీశ్వరులున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం నుంచి కొత్తగా గెలిచిన 812 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్ ప్రతిపాదికగా సర్వే చేసింది. కాగా కొద్దిమంది ఎమ్మెల్యేల వివరాలు మాత్రం అందుబాటులో లేవు. పుదుచ్చేరిలో మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 25 మంది కోటీశ్వరులు. ఆ తర్వాతి స్థానం తమిళనాడుది. తమిళనాడులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 76 శాతం మంది కోటీశ్వరులు. 223 మంది ఎమ్మెల్యేల వివరాలను పరిశీలించగా, 170 మంది కోటీశ్వరులని సర్వేలో తేలింది. ఇక అసోంలో 57 శాతం (126 మంది ఎమ్మెల్యేలలో 76 మంది), కేరళలో 44 శాతం (140 మందిలో 61 మంది) ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. ఐదు రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో తక్కువగా 34 శాతం మంది కోటీశ్వరులున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు 133 కోట్ల విలువైన ఆస్తులుండగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంతకుమార్ ఆస్తుల విలువ 337 కోట్ల రూపాయలు. కొత్త ఎమ్మెల్యేలలో 80 ఏళ్ల పైబడినవారు ఐదుగురు ఉండగా, 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసుగల ఎమ్మెల్యేలు ఐదుగురు ఎన్నికయ్యారు. మహిళా ఎమ్మెల్యేలు 77 మంది ఉన్నారు. పశ్చిమబెంగాల్ నుంచి అత్యధికంగా 10 మంది ఎమ్మెల్యేలు పీహెచ్డీ చేశారు. -
ఈ ముగ్గురూ పెళ్లికాని ముఖ్యమంత్రులు
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కొన్ని పార్టీలకు సంతోషం, మరికొన్ని పార్టీలకు బాధను మిగిల్చాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డులు సృష్టించినవారు, చరిత్ర తిరగరాసినవారు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాల్లో మరో విశేషం కూడా ఉంది. కొత్తగా ప్రమాణం చేయనున్న ఐదుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు అవివాహితులే..! తమిళనాడు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు జయలలిత, మమతా బెనర్జీలు అవివాహితులన్న విషయం తెలిసిందే. అసోంకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా పెళ్లి చేసుకోలేదు. విద్యార్థి దశ రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన 52 ఏళ్ల సోనోవాల్ బ్రహ్మచారిగా ఉంటూ తన జీవితాన్ని పూర్తిగా ప్రజలకు అంకింతం చేశారు. అసోం ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అసోంలో బీజేపీ తొలిసారి మెజార్టీ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇక పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వైదొలగబోతున్న ఎన్సీఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగసామి (66) కూడా అవివాహితుడే. పుదుచ్చేరిలో అధికారం చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. కేరళకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి విజయన్ మాత్రం వివాహితుడే.