న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుని రాజకీయ పార్టీలు తప్పుపట్టడం సరికాదని గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా అన్నారు. ఈవీఎంల విషయంలో రాజకీయ నేతలు ఎవరికి వారు తమకు అనుకూలంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈవీఎంలలో తలెత్తుతున్న లోపాలు, పొరపాట్లను సాధ్యమయ్యేంత తగ్గించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. ‘మేం సంతృప్తి చెందలేదు. కొన్ని సంఘటనలు (పొరపాట్లు, లోపాలు) పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం’అని చెప్పారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం, ఈవీఎంలలో లోపాలు తలెత్తడం రెండు వేర్వేరు అంశాలని అన్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణల్లో జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లో 1.76 లక్షల పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల మాత్రమే (ఒక శాతానికి తక్కువే) ఈవీఎంలలో పొరపాట్లు తలెత్తాయని.. ఇంతమాత్రానికే ఈవీఎంలను తప్పుపట్టడం సరికాదన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయని వాటిని చూసి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సైతం వేర్వేరు ఫలితాలు వచ్చాయని, అంతకుముందు నిర్వహించిన ఉప ఎన్నికల ఫలితాల్లో ఇదే విషయం రుజువైందని చెప్పారు. ఈవీఎంల విశ్వసనీయతపై రాజకీయ పార్టీల ఆరోపణలపై అరోరా స్పందిచారు. ‘ఓటర్ల తర్వాత రాజకీయపార్టీలే కీలక భాగస్వామి. అయితే కొన్ని పొరపాట్ల కారణంగా పార్టీలన్ని ఇష్టారీతిన వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది సరికాదు..’అని అన్నారు. అలాగే బ్యాలెట్ పేపర్ వైపు మరోసారి దేశం చూడాల్సిన అవసరం రాదని అరోరా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment