ఆగని దాడులు
Published Fri, Jan 31 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:11 AM
జాలర్లపై శ్రీలంక సేనల దాడులు ఆగలేదు. చర్చలు జరిగి వారం రోజులైనా కాలేదు, మళ్లీ తమిళ జాలర్లపై కడలిలో దాడి జరిగింది. గురువారం శ్రీలంక నావికాదళం తన పైశాచికత్వాన్ని ప్రదర్శించి 38 మందిని పట్టుకెళ్లింది. ఈ సమాచారం రామేశ్వరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. జాలర్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై దాడులకు, అరెస్టులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 27న రెండు దేశాల జాలర్లతో చెన్నైలో చర్చలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో దాడులు, అరెస్టులపై కీలక నిర్ణయా లు తీసుకున్నారు. ఆ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయాలు అమలయ్యే వరకు సరిహద్దులు దాటొద్దని శ్రీలంక జాలర్లు, రాష్ట్ర జాలర్లకు సూచించారు. దాడులు, అరెస్టులు జరగకుండా తాము సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. అయితే, ఈ చర్చలు జరిగి వారం రోజులైనా కాక ముందే మళ్లీ దాడి జరగడం కలకలం రేపుతోందన్నారు. చర్చల ఫలితంగా శ్రీలంక చెరలో ఉన్న 69 మంది తమిళ జాలర్లు బుధవారం రాష్ట్రానికి వచ్చారు. వీరి రాకతో రామేశ్వరం జాలర్లు సమ్మె వీడి సముద్రం బాట పట్టారు.
విడుదలైన వాళ్లు ఇలా వచ్చారో లేదో వేటకు వెళ్లిన వారు మళ్లీ బంధీ కావడంతో రామేశ్వరం, మండపం, పంబన్‌లలో ఉద్రిక్తత నెలకొంది. వేకవజామున పంజా: తమ వాళ్ల విడుదల సమాచారంతో ఐదు రోజుల తర్వాత చేపల వేటకు రామేశ్వరం, పంబన్, మండపం జాలర్లు బుధవారం రాత్రి కడలిలోకి వెళ్లారు. ఎడిషన్, నిషా, విన్నరసు, సహాయంతో పాటుగా పది మందికి చెందిన పడవలు కచ్చదీవుల సమీపంలో చేపల వేటలో నిమగ్నం అయ్యారు. వేకువ జామున అటువైపుగా వచ్చిన శ్రీలంక నావికాదళం పంజా విసిరింది. తాము సరిహద్దులు దాటలేదంటూ జాలర్లు పేర్కొంటున్నా, కచ్చ దీవుల వైపు ఎందుకొచ్చారంటూ వీరంగం సృష్టించారు. తమ బోట్లను, జాలర్ల పడవలకు గుద్దుతూ, వలల్ని తెంచి పడేస్తూ, దుడ్డు కర్రలతో దాడులు చేశారు.
దీంతో ఒడ్డుకు జాలర్లు తిరుగు పయనమయ్యారు. అయినా, వారిని వెంటాడి మరీ చితక బాదారు. నాలుగు పడవలు తప్పించుకోగా, ఆరు పడవల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులో ఉన్న 38 మంది జాలర్లను తమ దేశానికి పట్టుకెళ్లారు. వీరిని కాంగేషన్ హార్బర్‌లో ఉంచారు. అనంతరం అక్కడి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. ఈసమాచారంతో రామేశ్వరం తీర గ్రామాల్లో జాలర్లు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. జాలర్లను బుజ్జగించేందుకు మత్స్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పట్టుకెళ్లిన వారిని విడుదల చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement