చోరీకి గురైన రూ.4 కోట్ల బంగారు నగలు స్వాధీనం
Published Thu, Aug 22 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
పళ్లిపట్టు, న్యూస్‌లైన్ : శ్రీపెరంబుదూరు సమీపాన వ్యానులో చోరీకి గురైన నాలుగు కోట్ల రూపాయలు విలువచేసే బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితులను అరెస్టు చేశారు. హోసూరు దర్గా ప్రాంతంలో బంగారు నగలు తయారు చేసే వర్క్‌షాపు ఉంది. ఇక్కడ తయారైన నగలను వర్క్‌షాప్ ఉద్యోగి రాజేంద్రన్, రిటైర్డ్ సైనిక అధికారి సుబ్రమణి సోమవారం చెన్నైలోని బంగారు దుకాణాలకు అందజేసేందుకు వ్యానులో తీసుకుని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు వ్యానును అపహరించి నాలుగు కోట్ల విలువైన నగలు చోరి చేసిన విషయం తెలిసిందే. వ్యానును వెంబడించిన కారులోని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్లు టోల్‌గేట్ కెమెరాల్లో చిత్రాలు నమోదయ్యాయి.
వీటి ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు.డ ీఐజీ సత్యమూర్తి, జిల్లా ఎస్పీ విజయకుమార్ నేతృత్వంలోని ఆరు ప్రత్యేక పోలీసుల బృందాలు నిందితుల కోసం గాలించాయి. పోలీసులు వ్యాను డ్రైవర్ సతీష్‌ను అనుమానించి అతనిని అదుపులోనికి తీసుకున్నారు. అతనిని విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. సతీష్ కుమారుడు పాత నేరస్తుడు. ఒక కేసులో అరెస్టయి వేలూరు జైలులో గడిపాడు. కొద్ది నెలల క్రితం బయటికి వచ్చాడు. నాలుగు కోట్ల నగలను తీసుకువెళుతున్న విషయాన్ని సతీష్ తన మిత్రులకు తెలిపాడు. వారు వ్యానులోని నగలను చోరీ చేసి హోసూరులో దాచినట్లు తెలిసింది.
డ్రైవర్ సతీష్ ఇచ్చిన సమాచారం మేరకు హోసూరుకు చెందిన మురుగన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను హోసూరుకు చెందిన నాగరాజు ఇంట్లో దాచినట్టు మురుగన్ తెలిపాడు. దీంతో పోలీసులు నాగరాజు ఇంటిలోని ట్యాంక్ పక్కన ఉంచిన నగలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో వున్న నిందితులను కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Advertisement