రణరంగం! | 4 injured as cadres of Congress, pro-Tamil outfit clash in Chennai over Rajiv assassins release issue | Sakshi
Sakshi News home page

రణరంగం!

Published Thu, Feb 27 2014 1:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రణరంగం! - Sakshi

రణరంగం!

 రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్ పరిసరాలు బుధవారం రణరంగాన్ని తలపించాయి. తమకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారా? అంటూ తమిళ సంఘాలపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల వర్షం కురిపించారు. తమిళ సంఘాలు కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తగులబెట్టారు. పరస్పరం కయ్యానికి కాలు దువ్వడంతో పెట్రోల్ బాంబుల మోత మోగింది. రాళ్ల వర్షం కురిసింది. పలువురి తలలు పగిలాయి. పరిస్థితి కట్టడికి పోలీసులు లాఠీలు ఝుళిపించారు. భారీ బలగాలు ఆ పరిసరాల్లో మోహరించాయి.
 
 సాక్షి, చెన్నై:రాజీవ్ హత్య కేసు నిందితులు నళిని, పేరరివాలన్, సంతాన్, మురుగన్ సహా ఏడుగురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిని కేంద్రంలోని కాంగ్రెస్ సర్కారు అడ్డుకుంది. ఈ విడుదలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఎన్‌సీసీ, అనుబంధ విభాగాల నేతృత్వంలో రోజుకో రీతిలో నిరసనలు జరుగుతూ వస్తున్నాయి. విడుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పట్టుబడుతూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తూ వస్తుంటే, కేంద్రం తీరును నిరసిస్తూ తమిళ సంఘాలు పోరుబాట పట్టాయి. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించాయి. 
 
 ముట్టడి: నామ్ తమిళర్ కట్చి యువజన నేత అరివు సెల్వం నేతృత్వంలో పదుల సంఖ్యలో కార్యకర్తలు 
 ఉదయం సత్యమూర్తి భవన్ వైపుగా బయలు దేరారు. చేతిలో ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ చిత్ర పటాలు, బ్యానర్లను చేతబట్టి నిరసన ర్యాలీ నిర్వహించారు. మార్గం మధ్యలో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కారులు నినాదాలతో హోరెత్తించారు. సత్యమూర్తి భవన్ వైపు తమను అనుమతించాలని పట్టుబట్టారు. పదుల సంఖ్యలో ఉన్న నామ్ తమిళర్ కార్యకర్తల్ని చివరకు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆందోళన ముగిసిందని సర్వత్రా భావించారు. అయితే, అసలు చిచ్చు ఆ తర్వాతే రగిలింది. 
 
 కాంగ్రెస్ వీరంగం: తమ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎంత ధైర్యం అన్నట్టుగా నామ్ తమిళర్ కార్యకర్తల భరతం పట్టేందుకు కాంగ్రెస్ నాయకులు కరాటే త్యాగరాజన్, రంగ భాష్యం, కుమార్, రాయపురం మనోల నేతృత్వంలో కొందరు కార్యకర్తలు కార్యాలయం వద్ద మాటేశారు. అదే సమయంలో పోలీసులు అరెస్టు చేసినా, నలుగురు నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు వారి నుంచి తప్పించుకుని తమ నిరసన తెలియజేయడానికి యత్నించారు. సత్యమూర్తి భవన్ గేటు వద్దకు చేరుకోగానే, మాటేసిన కాంగ్రెస్ వర్గాలు రెచ్చి పోయాయి. ఆ నలుగురిని చితకబాది వదిలి పెట్టారు. పోలీసుల జోక్యంతో ఆ నలుగురి బతికి బయట పడ్డారు. 
 
 పరస్పర దాడులు: తమ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ మార్గంలో కాంగ్రెస్ నాయకులు రాస్తారోకోకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. అదే సమయంలో తమ వాళ్ల మీద దాడి చేశారన్న సమాచారంతో నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు, పలు ఈలం తమిళాభిమాన సంఘాల కార్యకర్తలు వందల సంఖ్యలో అన్నా సాలైలో గుమిగూడారు. ఆ సరిసరాల్లోని కాంగ్రెస్ ఫ్లెక్సీలు, బ్యానర్లు చించి తగల బెట్టారు. ఓ సైకిల్‌ను దహనం చేశారు. కాంగ్రెస్ వర్గాలతో తాడో పేడో తేల్చుకునే విధంగా ముందుకు దూసుకెళ్లారు. తమపై దాడికి యత్నిస్తున్నారన్న సమాచారంతో కాంగ్రెస్ వర్గాలు మేల్కొన్నాయి. రెండు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో సత్యమూర్తి భవన్ పరిసరాలు రణరంగంగా మారాయి. 
 
 దుకాణాలు మూత బడ్డాయి. వాహనాలను వదలి పెట్టి జనం ఉరకలు తీశారు. భయానక వాతావరణం నెలకొంది. పెట్రోల్ నింపిన బాటిళ్లను ఓ వర్గం మరో వర్గం మీద విసరడంతో చిచ్చు రాజుకుంది. రాళ్ల వర్షం కురవడంతో ఇరు వర్గాలతో పాటుగా పోలీసులు సైతం గాయపడ్డారు. ఊహించని రీతిలో వివాదం రాజుకోవడంతో భద్రతా కవచాలు కూడా లేని పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. లాఠీలకు పని పెట్టారు. కనిపించిన వాళ్లందరినీ తరిమి తరిమి కొట్టారు. జీపీ రోడ్డు మార్గంతో పాటుగా అన్నా సాలైలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎట్టకేలకు అతి కష్టం మీద పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. జీపీ రోడ్డును మూసి వేశారు. సత్యమూర్తి భవన్ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు. నిరసనకు యత్నించిన వాళ్లపై కాంగ్రెస్ వీరంగంతో తమిళ సంఘాలు ఆక్రోశంలో రగులుతున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. 
 
 ప్రభుత్వానిదే బాధ్యత: తలలు పగలడంతో గాయపడిన పలువురు  కార్యకర్తలను, పోలీసులను రాయపేట ఆస్పత్రికి తరించారు. సమాచారం అందుకున్న కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్, సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్ ఆస్పత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. మీడియాతో జ్ఞానదేశికన్ మాట్లాడుతూ, పదే పదే తమ కార్యాలయాన్ని ముట్టడించడం లక్ష్యంగా కొన్ని సంఘాలు యత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోని పక్షంలో తామూ తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. తమ వాళ్లపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని, లేని పక్షంలో తామేంటో చూపించాల్సి ఉంటుందని శివాలెత్తారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ మాట్లాడుతూ, తమ మీద దాడి జరుగుతుంటే, పోలీసులు చోద్యం చూశారని ధ్వజమెత్తారు. ప్రభ్తుత్వ కనుసన్నల్లోనే ఈ దాడి జరిగినట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలు మానుకోకుంటే కేంద్రంలోని తమ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement