40 వోల్వో బస్సుల దహనం
కావేరీ జలాల వివాదం తీవ్ర ఉద్రిక్తంగా మారుతోంది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కేపీఎన్ ట్రావెల్స్ ఇండియా అనే సంస్థకు చెందిన బస్సు డిపో బెంగళూరు డిసౌజా నగర్‌లో ఉంది. అక్కడ పార్క్ చేసి ఉంచిన దాదాపు 40 వోల్వో బస్సులను ఆందోళనకారులు తగలబెట్టేశారు. అది తమిళులకు చెందిన ట్రావెల్స్ సంస్థ అని గుర్తించిన కన్నడ ఉద్యమకారులు.. వాటి మీద పెట్రోలు చల్లి నిప్పంటించినట్లు తెలుస్తోంది. దాంతో ఒక్కసారిగా మొత్తం 40 బస్సులూ తగలబడిపోయాయి. కర్ణాటకలో.. ముఖ్యంగా రాజధాని బెంగళూరు నగరంలో టీఎన్ అనే అక్షరాలు కనిపిస్తే చాలు.. ఆ వాహనాలను ఎలాగోలా ధ్వంసం చేసేస్తున్నారు. అందులో సాధారణ ప్రయాణికులు ఉన్నా కూడా లెక్క చేయడం లేదు. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బెంగళూరులో 144 సెక్షన్ విధించారు, మెట్రో రైలు సర్వీసులను నిలిపివేశారు.
అయ్యంగార్ వర్గం వాళ్లు చాలా కాలం క్రితమే తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చి స్థిరపడ్డారు.. వీళ్లంతా ఇప్పుడు నానా కష్టాలు పడుతున్నారు. తమిళులను సులభమైన టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట నిజమే గానీ, నిరసనను శాంతియుతంగా తెలియజేయాలి తప్ప ఇలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వొద్దని కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర కోరారు. ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దని కోరారు. మరోవైపు బెంగళూరులో శాంతి భద్రతల పరిస్థితి, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం అవుతోంది.
చిక్కుకుపోయిన పిల్లలు
పిల్లలు ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్కూలు బస్సులు నడవడం కూడా కష్టమైపోయింది. కన్నడిగులపై తమిళనాడులో దాడులు జరుగుతున్న సమాచారం అందిన మరుక్షణం నుంచి... అంటే మధ్యాహ్నం 3 గంటల తర్వాతి నుంచి బెంగళూరు, మైసూరు సహా కర్ణాటకలోని అన్ని ప్రధాన ప్రాంతాలో విధ్వంసాలు మరింత పెరిగాయి. తమిళనాడులో కన్నడ హోటల్‌పై దాడి జరిగిందన్న విషయం మీడియాలో బయటకు వచ్చిన కొద్ది సేపటికే కేపీఎన్ ట్రావెల్స్ డిపోలో ఉన్న 40 బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు.
మరోవైపు తమిళనాడు కూడా తగలబడుతోంది. అక్కడ ఉన్న కన్నడిగుల ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. మైలాపూర్‌లోని న్యూ ఉడ్‌ల్యాండ్ హోటల్‌పై పెట్రోలు బాంబులతో దాడి జరిగింది. రామేశ్వరంలో కర్ణాటక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై దాడులు జరిగాయి.