నేలపాలు | 5 lakh liters of milk waste | Sakshi

నేలపాలు

Published Tue, May 5 2015 2:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM

5 lakh liters of milk waste

 పాల సేకరణపై ఆవిన్ కోత
  పాడి రైతులకు తీరని వ్యథ
  5 లక్షల లీటర్ల పాలు వృథా
  పాలసేకరణ పెంచాలని రైతుల డిమాండ్

 
 పాల ఉత్పత్తి పెరిగినందుకు సంతోషించాల్సిన పాడి రైతు ఆవిన్ వైఖరితో ఉసూరుమంటున్నాడు. పాల సేకరణపై ఆవిన్ కోతలు
 పెట్టడంతో పాడిరైతుల వెతలు వర్ణనాతీతంగా మారాయి. నిరసనగా పాలను నేలపాలు చేశారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ప్రయివేటు డెయిరీలు పాలసేకరణ ధరను తగ్గించడంతో పాడి రైతులు ఆవిన్ వద్ద క్యూ కడుతున్నారు. మరో వైపు రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, కరువు కాటకాల వల్ల రైతులు పొలాన్ని వీడి పాడి పరిశ్రమపైనే ఆధారపడుతున్నారు. ఆవిన్ సంస్థ సైతం పాల ఉత్పత్తిని పెంచేందుకు గతంలో అధికారులను రంగంలోకి దించింది. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 30.20 లక్షల లీటర్లపాలు ఉత్పత్తి అవుతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సైతం పాల ఉత్పత్తి పెరిగింది. ఆయా రాష్ట్రాల నుంచి తమిళనాడుకు చేరుకునే పాలశాతం కూడా పెరిగింది.
 
 దీంతో ఆవిన్ సంస్థ పాల సేకరణను 10 నుంచి 18 శాతం వరకు తగ్గించడం ప్రారంభించింది. ప్రతిరోజూ 25.12 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఆవిన్ సంస్థ కొనుగోలు చేస్తోంది. ఈ పరిణామంతో పాడిరైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆవిన్ తీరును ఖండిస్తూ సేలం, నామక్కల్, విళుపురం, వేలూరు జిల్లాల్లో పాడిరైతులు వేలాది లీటర్ల పాలను నడిరోడ్డులో పోసి నిరసన తెలియజేశారు. రాష్ట్రం మొత్తం మీద 30.20 లక్షల లీటర్లు ఉత్పత్తి అవుతుండగా 25.12 లక్షల లీటర్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. గత ఏడాది నవంబరు ఒకటో తేదీన పాల ధర లీటరుకు రూ.5 పెంచారు.
 
  పాల కొనుగోలును హెచ్చుశాతంలో చూపేందుకు ఉత్పత్తి దారులు ప్రయివేటు డెయిరీలకు సరఫరా చేసే పాలను అధికారుల ఒత్తిడి చేసి సేకరణ కేంద్రాలకు మళ్లించారు. దక్షిణాది జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పైరుతో పాటు పాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. పాలతో ఇతర వస్తువులు తయారు చేయడం, నిల్వ చేసుకునేందుకు ఆవిన్ సంస్థలో సౌకర్యం లేదు. దీంతో పాల సేకరణను గణనీయంగా తగ్గించి వేస్తున్నారు. అనేక చోట్ల పాలసేకరణ వ్యాన్లను ఆవిన్ పంపడం మానేసింది. పాడి రైతులే తాముగా తెచ్చే పాలలో 15 శాతం వరకు తిరస్కరిస్తున్నారు. పాల నుంచి పాలపౌడర్, వెన్న తయారీతో ఆవిన్‌కు నష్టం వచ్చే అవకాశాలు అధికం కావడంతో ఆ దిశగా అధికారులు ఉత్సాహం చూపడం లేదు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పాలను మరింత కాలం భద్రం చేయగల సాంకేతిక పరిజ్ఞానంతో ఇతర రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. ఆయా రాష్ట్రాల పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడటంలో సఫలీకృతులవుతున్నారు. తమిళనాడులో పాల ఉత్పత్తి 2011-12లో 21.40 లక్షల లీటర్లు కాగా, ప్రస్తుతం 30.20 లక్షల లీటర్లకు పెరిగింది. ఆ స్థాయిలో అమ్మకాలు పెరగలేదు.
 
 ఉత్పత్తి పెరిగిన నష్టాలు తప్పడం లేదు..
 ఉత్పత్తి పెరిగిన ఆనందం ఒకవైపు ఉన్నా నష్టాలు చవిచూడాల్సి రావడం ఇబ్బందిగా ఉందని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రన్ అన్నారు. సేలంలో 5.52 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం 5.02 లక్షల లీటర్లుగా తగ్గించారని తెలిపారు. పాల సేకరణ గతఆర్థిక సంవత్సరంలో 5లక్షల లీటర్లకు చేరుకోగా అమ్మకాల్లో 12 వేల లీటర్లు మాత్రమే పెరిగింది. ఈ కారణంగా ఆవిన్ తరచూ నష్టాలను ఎదుర్కొంటోందని అన్నారు. నష్టాలను తగ్గించుకునేందుకు అవకాశాలను అన్వేషించకుండా సేకరణను తగ్గించుకుంటూ పోవడం వల్ల పాడిరైతుల పరిస్థితి దయనీయంగా మారుతోందని చెప్పారు. ప్రభుత్వ పథకాలకు ఆవిన్ పాలను వినియోగించడం, పాల ఉత్పత్తుల సంఖ్యను పెంచడం ద్వారా పాడి రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement