
50 కొత్త విమానాశ్రయాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో 50 కొత్త విమానాశ్రయాలను నెలకొల్పేందుకు కేంద్రం నిర్ణయించినట్లు విమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త విమానాశ్రయాలను నెలకొల్పేందుకు భూసేకరణ సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరిస్తే కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సులువవుతుందని తెలిపారు.
విమానయాన శాఖలో ప్రపంచంలోనే భారతదేశం 20 శాతం అభివృద్ధి చెందిందన్నారు. చైనా తొమ్మిది శాతం, ఇతర దేశాలు ఒకటిన్నర శాతం వృద్ధిలో ఉన్నాయని తెలిపారు. స్వదేశం కంటే విదేశీ ప్రయాణాలకే ప్రయాణికులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని తెలిపారు. ప్రాంతీయ ప్రయాణాలను సైతం ప్రోత్సహించేందుకు తమ శాఖ అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలో 32 విమానాశ్రయాలు అనుసంధానంగా ఉన్నా మౌలిక సదుపాయాల్లో ఇంకా లోటు ఉందని, ఈ లోటును భర్తీ చేసేందుకు ముందుగా పది విమానాశ్రయాలను ఎన్నుకున్నట్లు ఆయన వెల్లడించారు.