సాక్షి, చెన్నై: స్వైన్ ఫ్లూ భయం రాష్ట్రంలో మళ్లీ నెలకొంది. చెన్నైలో ఓ వ్యక్తి మరణించడంతో ఎక్కడ ఈ ఫ్లూ ప్రబలుతుందోనన్న ఆందోళన జనంలో మొదలైంది. స్వైన్ ఫ్లూ ప్రవేశించిన సమాచారంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. 1.5 లక్షల డామ్లీ ఫ్లూ మాత్రల్ని, ఫ్లూ నివారణ వ్యాక్సిన్లను సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఏడాదిన్నర క్రితం స్వైన్ ఫ్లూ విలయతాండవం చేసింది. ఆరోగ్య శాఖ చేపట్టిన పకడ్బందీ చర్యలతో ఆ పేరు కాస్త తెర మరుగైంది. అయినా, అప్పుడుప్పుడు స్వైన్ ఫ్లూ పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. తాజా సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా పడడంతో ఎక్కడ అంటు రోగాలు ప్రబలుతాయోనన్న బెంగతో అప్రమత్తంగానే వ్యవహరించారు. అయితే, దక్షిణ తమిళనాడులో విష జ్వరాలు, అతి సారా వంటి రోగాలు ప్రబలడంతో వాటి కట్టడి లక్ష్యంగా ఆరోగ్య శాఖ పరుగులు తీస్తోంది.
ఈ పరిస్థితుల్లో తెలంగాణలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్న వేళ ఆ తాకిడి చెన్నైకి పాకినట్టుంది. రైల్వే ఉద్యోగి ఒకరు స్వైన్ ఫ్లూతో మరణించిన సమాచారం ప్రజల్లో మళ్లీ ఆందోళనను రేకెత్తిస్తున్నది. ప్రజల్లో బయల్దేరిన భయంతో ఈ జ్వరం బారిన ఎవరూ పడకుండా, ఈ ఫ్లూను ఆరంభ దశలోనే తరిమికొట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.అప్రమత్తం : స్వైన్‌ఫ్లూ బారిన పడి మరణించిన రైల్వే ఉద్యోగి మన్నడికి చెందిన శ్రీనివాసన్‌గా గుర్తించారు. ఈ దృష్ట్యా, ఆయన నివాసం ఉంటున్న పరిసరాల్లో జ్వరంతో బాధ పడుతున్న వాళ్లెవరైనా ఉన్నారా..? అని పరిశీలించే పనిలో వైద్యాధికారులు పడ్డారు. ఆయన కుటుంబీకులకు సైతం పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల అధికారుల ద్వారా ప్రజల్ని అప్రమత్తం చేసే విధంగా ప్రచార కార్యక్రమాలకు సిద్ధం అవుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాల్ని వివరిస్తూ, అప్రమత్తంగా ఉండాలని, తక్షణం వైద్య చికిత్సలు తీసుకోవాలని పిలుపునిచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. అలాగే, ఈ ఫ్లూ భయం జనంలో రెట్టింపు అయినా, ఫ్లూ తీవ్రత పెరిగినా తక్షణం వైద్య చికిత్సతోపాటుగా మందుల్ని సరఫరా చేయడానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య శాఖ చేతిలో లక్షన్నర మందికి ఉపయోగపడే డామ్లీ ఫ్లూ మాత్రలు, వ్యాక్సిన్లు సిద్ధంగా ఉండడం విశేషం. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రవేశించకుండా తరిమి కొట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు. ప్రజల్లోను చైతన్యం రావాలని, జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఈ జ్వరం పక్క వారికి వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, గొంతు నొప్పి జలుబు ఈ ఫ్లూ లక్షణాలుగా వివరించారు. ఈ లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తే తక్షణం చికిత్స పొందాలని సూచించారు. రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ లేదని, అయితే, ఆ వ్యక్తికి ఆ జ్వరం ఎక్కడ సోకిందోనన్న విచారణ వేగవంతం చేశామన్నారు. పక్క రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ ఉన్న దృష్ట్యా అక్కడి నుంచి ఎవరైనా ఇక్కడికి వచ్చినా, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలోని వైద్యాధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.
స్వైన్ ఫ్లూ భయం
Published Thu, Jan 22 2015 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM
Advertisement
Advertisement