మహిళలకు కానుక
Published Thu, Sep 19 2013 2:25 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధం చేసిన కుట్టుమిషన్లను మహిళలకు పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి జయలలిత నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 54 వేల మందికి వీటిని అందించనున్నారు. తొలి విడతగా 27,900 మందికి పంపిణీ చేసే కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టారు.
సాక్షి, చెన్నై: మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి జయలలిత అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళా స్వయం సహాయక బృందాల్ని బలోపేతం చేయడం లక్ష్యంగా సరికొత్త పథకాల్ని అమల్లోకి తెస్తున్నారు. అలాగే తల్లీశిశువులకు భద్రత కల్పిస్తున్నారు. పేద యువతుల వివాహానికి ప్రోత్సాహకం అందజేస్తున్నారు. తాజాగా మహిళా టైలర్ల సంక్షేమంపై దృష్టి పెట్టారు. మహిళా సహకార సంఘాల పరిధిలోని కుట్టు శిక్షణ కేంద్రాల్లో టైలర్లుగా రాణిస్తున్న వారికి ఆపన్న హస్తం అందిస్తూ చర్యలు తీసుకున్నారు. వీరికి ప్రభుత్వ సహకారం, సహకార సంఘం రుణంతో కుట్టు మిషన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
కుట్టుమిషన్ల పంపిణీ
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా యూనిఫాం అందజేస్తోంది. వీటిని మహిళా సహకార సంఘాల కుట్టు శిక్షణ కేంద్రాల్లోని మహిళా టైలర్ల ద్వారా సిద్ధం చేయడానికి జయలలిత నిర్ణయించారు. మహిళా టైలర్లను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా కసరత్తులు పూర్తి చేశారు. మొత్తం రూ.54 కోట్లతో 54 వేల మందికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కుట్టుమిషన్లను పంపిణీ చేయడానికి నిర్ణయించారు. తొలి విడతగా 27,900 మందికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నారు. సచివాలయంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కుట్టుమిషన్ల పంపిణీని ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. ఇద్దరు మహిళా టైలర్లకు ఈ మిషన్లను అందజేశారు.
గృహాల కేటాయింపు
సముద్రతీర గ్రామాల్లోని ఐదు వేల మంది లబ్ధిదారులకు కొత్త గృహాల్ని జయలలిత కేటాయించారు. సునామీ వంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొని నిలబడే రీతిలో ఈ గృహాల్ని నిర్మించారు. సునామీ విలయ తాండవం గురించి తెలిసిందే. అలాంటి విపత్తుల నుంచి సముద్రతీర వాసుల్ని రక్షించడం లక్ష్యంగా కొత్త తరహాలో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 11 జిల్లాలోని 444 గ్రామాలు సముద్రానికి అతి సమీపంలో ఉండడాన్ని గుర్తించింది.
ఈ గ్రామాల్లోని ప్రజలకు 14,364 గృహాల్ని నిర్మించేందుకు రూ.209 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం 5674 గృహాల నిర్మాణం పూర్తయింది. సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ గృహాల్ని ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. వీటిని లబ్ధిదారులకు కేటాయించారు. అలాగే ధర్మపురి, అరియలూరు, కోయంబత్తూరు, కడలూరు, ఈరోడ్, పుదుకోట్టై, తిరునల్వేలి, తిరువారూర్, తంజావూరు తదితర 21 జిల్లాల్లో రూ.5.6 కోట్లతో నిర్మించిన 134 ఆరోగ్య కేంద్రాల్ని జయలలిత ప్రారంభించారు.
Advertisement
Advertisement