
టాయ్‌లెట్‌లో రూ.75 లక్షల బంగారు బిస్కెట్లు
ప్యారిస్ : తిరుచ్చి విమానాశ్రయంలో విదేశాల నుంచి విమానంలో వచ్చిన ప్రయూణికులందరినీ అధికారులు మంగళవారం రాత్రి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల సమయంలో విమానాశ్రయంలోపల ఉన్న మరుగుదొడ్డిలో గుర్తు తెలియని పార్సిల్ ఉన్నట్టు పారిశుద్ధ్య సిబ్బంది అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడు మూడు పార్సిల్స్ పడి ఉన్నాయి. అధికారులు ఆ పార్సిళ్లను విప్పి చూడగా, అందులో బంగారు బిస్కెట్‌లు కనిపించాయి. ఒక్కొక్క బాక్స్‌లోను ఒక్కొక్క కిలో బరువు గల బంగారు బిస్కెట్‌లు ఉన్నాయని, మూడు బాక్స్‌లలో మూడు కిలోల బంగారు బిస్కెట్‌లు ఉన్నట్టు తెలిసింది. అవి రూ.75 లక్షల విలువ ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 11.30 గంటల సమయంలో మలేషియా నుంచి విమానంలో తిరుచ్చికి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా పోలీసుల తనిఖీలకు భయపడి తాము తెచ్చిన బంగారు బిస్కెట్‌లను టాయ్‌లెట్‌లో పడ వేసి ఉంటారని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ విమానంలో వచ్చిన వారి పేర్లు, వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.