శిక్ష పడినప్పటి నుంచి తమ వారిని ఎప్పుడు ఉరి తీస్తారోనని మానసిక వేదన... ఒకటా.. రెండా కొన్నేళ్లుగా కర్ణాటకలోని హిండలాగ జైలులో ఉరిశిక్ష ఖైదీలతో పాటు
- 8 మందికి ఉరిశిక్ష రద్దు
- శిక్ష అనుభవిస్తున్న వీరప్పన్ అనుచరుల్లో ఆనందం
- 15 మందికి ఉరిశిక్ష రద్దు చేస్తూ సుప్రీం తీర్పు
- వారిలో 8 మంది కర్ణాటక వారే
- యావజ్జీవ శిక్షగా ఖరారు
బెంగళూరు, న్యూస్‌లైన్ : శిక్ష పడినప్పటి నుంచి తమ వారిని ఎప్పుడు ఉరి తీస్తారోనని మానసిక వేదన... ఒకటా.. రెండా కొన్నేళ్లుగా కర్ణాటకలోని హిండలాగ జైలులో ఉరిశిక్ష ఖైదీలతో పాటు వారి బంధువులు పడిన వేదన మంగళవారం సుప్రీం తీర్పుతో ఊహించని ఉపశమనం లభించింది. మంగళవారం సుప్రీం కోర్టు ఏకంగా 15 మందికి ఉరిశిక్ష రద్దు చేసి యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. అందులో 8 మంది కర్ణాటకకు చెందిన వారే. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించినప్పటి నుంచి వారిలో నిత్యం మానసిక సంఘర్షణ.. బతకాలనే ఆశ.. కుటుంబ సభ్యులను కలుసుకోవాలనే తపన.. సుప్రీం తీర్పుతో మరోజన్మ ఎత్తినట్లు అయ్యిం ది.
వివరాలు... ఒకప్పడు రాష్ట్రాన్ని గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ అనుచరులు కొన్నేళ్ల క్రితం తమిళనాడులో మందుపాతరలు పెట్టి 22 మంది కర్ణాటక పోలీసులు మట్టుబెట్టారు. ఈ కేసులో వీరప్పన్ అనుచరులు సైమన్, జ్ఞానప్రకాష్, బిలవేంద్ర, మిసకార మాదయ్యలకు ఉరి శిక్ష పడింది. ఈ నలుగురు బెల్గాంలోని హిండలాగ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ నలుగురు పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీలను రాష్ట్రపతి తిరస్కరించారు. ఇక ఉరి కొయ్యపై వేలాడాల్సిందేనని నిర్ణయమైపోయింది. ఉరి తాడులు సైతం సిద్ధం చేశారు.
జైలు చుట్టపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవన్ని కొన్ని నెలల క్రితం జరిగిన తతంగం. ఉరి శిక్ష పడిన నలుగురి కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుని తమ వారిని కడసారి చూసుకుంటామని మూడు రోజుల పాటు పడరాని అగచాట్లు పడ్డారు. అయినా జైలు అధికారులు కరుణించలేదు. ఇంటి నుంచి తీసుకువచ్చిన చివరి భోజనం అయినా ఇవ్వమని ప్రాధేయపడ్డారు. అయినా జైలు అధికారులు పట్టించుకోలేదు. చివరకు న్యాయవాదుల సహాయంతో వారు కడసారిగా జైలులో ఉన్న తమవారిని చూసుకుని బయటకు వచ్చి బోరున విలపించారు.
సుప్రీం తీర్పు ఆ నలుగురి కుటుంబంలో ఆనందోత్సహాలు నెలకొన్నాయి. అదే విధంగా చామరాజనగర జిల్లా కోళ్లేగాళలో మహిళను కిడ్నాప్ చేసి సామూహిక లైంగిక దాడి చేసి దారుణంగా హతమార్చిన శివు, జడేస్వామిలకు ఉరి శిక్ష పడింది. వీరు కూడా ఉరి శిక్ష నుంచి తప్పించుకున్నారు. గల్బర్గా జిల్లా జీవర్గి తాలుకా మందేవాల గ్రామానికి చెందిన సాయిబణ్ణ నింగప్ప తన ఇద్దరు భార్యలు, పిల్లలను హతమార్చడంతో ఉరిశిక్ష పడింది.
ఇతను కూడా తాజా సుప్రీం తీర్పుతో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడు. దక్షిణ కన్నడ జిల్లా వామంజూరుకు చెందిన ప్రవీణ్ కుమార్ అనే నిందితుడు వ ుుగ్గురిని అతి దారుణంగా హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఇతనికి ఉరిశిక్ష పడింది. ఇతను కూడా ఉరిశిక్ష తప్పించుకున్నాడు. మంగళవారం సుప్రీం కోర్టు తీర్పుతో ఉరి శిక్ష నుంచి తప్పించుకున్న వారిలో కర్ణాటకలోనే 8 మంది శిక్ష అనుభవిస్తున్నారు.