ఎట్టకేలకు బయటకు..
► దినకరన్‌కు షరుతులతో కూడిన బెయిల్
► అనుచరుల్లో ఆనందం
కేసులపై కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాను దక్కించుకున్న శశికళ సీఎం సీటుపై కూడా కన్నేశారు. ఇంతలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు ముంచుకు రాగా నాలుగేళ్ల జైలు శిక్షకు గురయ్యారు. అన్నాడీఎంకేకు అన్నీతానై వ్యవహరించాలనే ఆశలు అడుగంటిపోవడంతో తన అక్క కుమారుడు దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా చేసి తనకు బదులుగా పార్టీ బాధ్యతలను అప్పగించారు. అయితే చిన్నమ్మ తరహాలోనే సీఎం పీఠంపై మోజు పెంచుకున్న దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా పార్టీతోపాటు ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించారు.
అన్నాడీఎంకేలో చీలిక కారణంగా పార్టీపేరు, రెండాకుల చిహ్నంపై ప్రధాన ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిషేధం విధించడంతో దినకరన్ దిగాలు పడ్డారు. రెండాకుల చిహ్నం లేకుండా గెలుపొందడం కష్టమని నిర్ధారణకు వచ్చిన దినకరన్ డబ్బును నీళ్లలా ఖర్చపెట్టడం వివాదాస్పదం కావడంతో ఎన్నికలు రద్దయ్యాయి. అంతటితో ఆగని దినకరన్ అర్కేనగర్‌కు మళ్లీ ఉప ఎన్నికలు వచ్చేలోగా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు సైతం బెడిసికొట్టాయి. ఎన్నికల కమిషన్‌లోని ఒక అధికారిని లోబరుచుకుని రెండాకుల చిహ్నం సాధించిపెడతానని బెంగళూరుకు చెందిన సుకేష్ అనే మధ్యవర్తితో రూ.60 కోట్లకు బేరం కుదుర్చుకున్న విషయం ఢిల్లీ పోలీసులకు దృష్టికి వెళ్లింది.
మధ్యవర్తి సుకేష్ వాంగ్మూలం ఆధారంగా దినకరన్‌పై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసిన ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు ఏప్రిల్ 25వ తేదీ అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. నెలరోజులకు పైగా తీహార్ జైల్లో ఉన్న దినకరన్, అతనితో పాటూ అరెస్టయిన స్నేహితుడు మల్లికార్జున్ పలుమార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కలేదు. వీరిద్దరి బెయిల్‌పై ఇరుపక్షాల వాదనపై విచారణ గత నెల 26వ తేదీన పూర్తయింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పూనం చౌదరి గురువారం బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కొక్కరూ రూ.5 లక్షల పూచీకత్తుపై చెల్లించాలని, పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని న్యాయమూర్తి షరతులు విధించారు.
అనుచరుల్లో ఆనందం:పార్టీలో చీలికలు, శశికళ, దినకరన్ జైలుకు వంటి సంఘటనలతో అన్నాడీఎంకేలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొని ఉన్నాయి. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరిస్తే విలీనం అయ్యేందుకు తమకు అభ్యంతరం లేదని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌కు ఆమోదిస్తున్నట్లుగా శశికళ, దినకరన్‌లకు పార్టీతో సంబంధం లేదని మంత్రి జయకుమార్ ప్రకటించారు. శశికళ వర్గానికి చెందిన ఎడపాడి పళనిస్వామి సీఎంగా కొనసాగుతున్నారు. ఈ దశలో దినకరన్‌కు బెయిల్ మంజూరు కావడం ఎడపాడి వర్గంలో చర్చనీయాంశమైంది. జైలు నుంచి బైటకు వచ్చిన దినకరన్ ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ బాధ్యతల్లో కొనసాగుతారా, ప్రభుత్వంలో జోక్యం చేసుకుంటారా అని అధికార వర్గంలో భీతి నెలకొంది. అయితే దినకరన్ వెంట నిలిచిన కొందరు ఎమ్మెల్యేలు, అనుచరులు మాత్రం బెయిల్ మంజూరుపై సంబరాలు చేసుకుంటున్నారు.