
మహిళపై అత్యాచారం, హత్య
► 70 సవర్ల నగలు చోరీ
కేకేనగర్: మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసి ఇంట్లోని 70 సవర్ల నగలు, నగదు దోపిడీ చేసిన సంఘటన తిరువణ్ణామలై జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరువణ్ణామలై జిల్లా కన్నమంగళం, కుట్టుకానల్లూర్ సమీపంలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన శంకర్(45) అస్సాంలో సైనిక అధికారిగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య కాంతరూపి(40), కుమారుడు శక్తివేల్(16) ప్లస్‌వన్ చదువుతున్నాడు. తల్లి, కుమారుడు రామచంద్రాపురం గ్రామంలో నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం శక్తివేల్ ట్యూషన్‌కు వెళ్లి రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చాడు.
ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో తల్లి కోసం చూసిన అతనికి ఆమె వంట గదిలో రక్తపు మడుగులో మృతి చెంది కనిపించింది. దిగ్భ్రాంతి చెందిన శక్తివేల్ పెద్దగా రోదించాడు. అతని ఏడుపు విని చుట్టుపక్కల వారు వచ్చి అతడిని ఓదార్చారు. దీనిపై సమాచారం అందుకున్న కన్నమంగళం పోలీసులు, ఆరని డీఎస్పీ రెజీనా బేగం, ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో కాంతరూపి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం గమనించిన అగంతకులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం జరిపి, బీరువాలో ఉన్న 70 సవర్ల నగలు, నగదును చోరి చేసినట్లు తెలిపారు. ఆధారాలు దొరక్కుండా దుండగులు ఇంటి చుట్టూ కారం చల్లి వెళ్లారు. వేలూరు నుంచి వేలిముద్ర నిపుణులను రప్పించి దుండగుల గుర్తులను సేకరించారు. కాంతరూపి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు మంగళాపురం, కల్పట్టు గ్రామాలకు చెందిన ఇద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.