అమరావతిలో కలకలం
అనంతవరం: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆకాశరామన్న లేఖ కలకలం రేపింది. టీడీపీ నాయకులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో ఆకాశరామన్న ఉత్తరం వెలుగులోకి రావడంతో అధికార పార్టీ ఉలిక్కి పడింది. ఈ లేఖలను బాధితులు శనివారం గ్రామంలో పంచారు.
తమ గ్రామంలో టీడీపీ నేతలు 18.78 ఎకరాల భూములు కాజేశారని లేఖలో ఆరోపించారు. రైతులు, అధికారులను బెదిరించి భూకబ్జాకు పాల్పడ్డారని వాపోయారు. సీఆర్డీఏ అండతో తమ భూములు కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాంగ్స్టర్ నయీంతో సంబంధాలున్నాయని రైతులను బెదిరించారని వెల్లడించారు. టీడీపీ నాయకులకు కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ఆకాశరామన్న లేఖతో తమ బండారం బయటపడడంతో అధికార పార్టీ నాయకుల్లో గుబులు మొదలైంది. అమరావతిలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువుత్తుతున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు మరింత ఇరకాటంలో పడే పరిస్థితి కనిపిస్తోంది.