ఇంటింటా ఆప్ ప్రచారం
ఇంటింటా ఆప్ ప్రచారం
Published Tue, Mar 11 2014 11:25 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ, అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌పై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిలో కనీసం 35 లక్షల ఇళ్లు తిరిగి ప్రచారం చేయాలని పార్టీ నిశ్చయించింది. 30 వేల మంది ఆప్ వాలంటీర్లకు ఈ బాధ్యతను అప్పగించారు. ఆప్ గురించి జరుగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు లోక్‌సభ ఎన్నికల పార్టీ అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేస్తారు.
ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడానికి ఆప్ నాలుగు పేజీల కరపత్రాలను తయారు చేసింది. కార్యకర్తల బృందం ఈ కరపత్రాలను ఢిల్లీవాసుల ఇళ్లలో పంచుతుంది. దీని మొదటిపేజీలో లోక్ సభ అభ్యర్థుల గురించిన పరిచయం, వివరాలు ఉంటాయి. సదరు అభ్యర్థి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ రెండోపేజీలో ఉంటుంది. మూడోపేజీలో 49 రోజులపాలనలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో సాధించిన విజయాలను వివరిస్తారు. ఆప్ గురించి తరచుగా వ్యక్తమయ్యే సందేహాలు, ఆరోపణలపై వివరణలు ఉంటాయి. ఆప్ ఎందుకు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. జన్‌లోక్‌పాల్ బిల్లు గురించి కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చే శారు. తదితర ప్రశ్నలకు జవాబులు ఉంటాయని ఆప్ ఢిల్లీ రాష్ట్ర కమిటీ కో-కన్వీనర్ దుర్గేశ్ పాఠక్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు, ఆప్ నిర్ణయాల గురించి పదేపదే వివాదాలు తలెత్తుతున్నందువల్ల ఈ విషయాలపై పార్టీ వైఖరిని ప్రజలకు సుస్పష్టంగా వివరించాలని నిర్ణయించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన ఇంటింటికీ ప్రచార కార్యక్రమం సత్పలితాలను ఇవ్వడంతో మరోసారి ఇదే వ్యూహాన్ని అనుసరించాలని ఆప్ కోరుకుంటోంది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కార్యకర్తలు 30-40 లక్షల ఇళ్లను సందర్శించడంతోపాటు పార్టీలో సభ్యులుగా చేరాలని ఢిల్లీవాసులను ప్రోత్సహించారు. ఆప్ కోసం విరాళాలనూ సేకరించారు. దీనికి మంచి స్పందన రావడంతో కాంగ్రెస్, బీజేపీ కూడా ఇదే పద్ధతిని అనుకరించాయి. ఇంటింటా తిరిగి ప్రచారం చేయడానికి ఆప్ మూడు వేల మందికి శిక్షణ ఇచ్చింది. వారు తిరిగి 30 మంది వేల కార్యకర్తలకు అదే శిక్షణ ఇచ్చారు. వీరంతా అందరి ఇళ్లకూ వెళ్లి ప్రచారం చేశారు. ఈ బలగంలో విద్యార్థులతోపాటు యువ వృత్తి నిపుణులు, వ్యాపారులు ఉన్నారు. ఈ వాలంటీర్లు 15 రోజులు సెలవు తీసుకుని వచ్చి ఆప్ తరపున ప్రచారం చేస్తారు.
Advertisement