ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇవ్వం
ఎమ్మెల్యేలకు ఎంపీ టికెట్లు ఇవ్వం
Published Wed, Feb 26 2014 11:48 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వబోమని బీజేపీ, ఆప్ ప్రకటించాయి. బీజేపీ విషయానికి వస్తే.. ఇది రాష్ట్రంలోని ఏడు లోక్‌సభ స్థానాల నుంచి పార్టీ తరపున పోటీచేసే అభ్యర్థుల పేర్లను మార్చి నెలాఖరుకే ప్రకటించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి 28న లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని అప్పట్లో డిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న విజయ్ గోయల్ ప్రకటించారు. అయితే టికెట్లను ఆశించేవారి సంఖ్య అధికంగా ఉండడం, పార్టీ నాయకత్వం మారడం వల్ల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో జాప్యం జరిగింది. అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో జాప్యం కావడంతో తమ విజయావకాశాలకు ఢోకా ఏమీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు.
దేశంలో నరేంద్ర మోడీ గాలి వీస్తోందన్న విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా అంగీకరించారని, ఢిల్లీలో ఏడింటికి ఏడు స్థానాలు తమవేనని వారు నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతిపాలన కిందున్న ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల అనంతరం తమ ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతామని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వరాదనే అభిప్రాయంతో ఉంది. విజయావకాశాలు అధికంగా ఉన్నవారికే టికెట్ ఇస్తామని పార్టీ ఇన్‌చార్జ్ ప్రభాత్ ఝా చెప్పారు. లోక్‌సభ టికెట్లను ఆశిస్తున్నవారికి ప్రజల్లో ఉన్న ఆదరణను. వారి పనితీరును స్వయంగా పరిశీలించిన తరువాతే అవకాశం ఇస్తామని హర్షవ ర్ధన్ తెలిపారు.
ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్లు ఇవ్వడం లేదు: ఆప్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలైన వారికి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని ఇవ్వబోమని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. మంగోల్‌పురి ఎమ్మెల్యే, మహిళా, శిశు అభివృద్ధిశాఖ మాజీ మంత్రి రాఖీ బిర్లాకు కూడా టికెట్ ఇవ్వబోమని ఆప్ ప్రకటించింది. రాఖీ బిర్లా లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తారని, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి కృష్ణాతీరథ్‌తో ఆమె తలపడతారని వార్తలు వచ్చాయి. వాయవ్యఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రాఖీ బిర్లాకు మద్దతుగా పోస్టర్లు కూడా వెలిశాయి. ఆమెకు లోక్‌సభ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఆప్ కార్యకర్తలు హనుమాన్ రోడ్డులోని పార్టీ కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు కూడా ప్రారంభించారు.
బుధవారం నాటికి వీరి నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్లు ఇవ్వబోమని ప్రకటించిన కేజ్రీవాల్ రాఖీ బిర్లాకు ఎలా టికెట్ ఇచ్చార ని వారు ప్రశ్నించారు. వాయవ్య ఢిల్లీ లోక్‌సభ టికెట్ కోసం 162 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారందరిని కాదని దరఖాస్తు కూడా చేసుకోని రాఖీ బిర్లాకు టికెట్ ఇవ్వడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో ఆప్ పారదర్శకతను పాటించడం లేదని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లోక్‌సభ టికెట్లు ఇవ్వబోవడం లేదని అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
Advertisement
Advertisement