అహ్మదాబాద్: తమ పార్టీ దృష్టంతా ఢిల్లీ ఎన్నికలపైనేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) స్పష్టం చేసింది. గుజరాత్‌లో ఓ లోక్‌సభ, తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయబోమని తేల్చిచెప్పింది. పంజాబ్‌లో గత నెలలో జరిగిన జాతీయ కార్యవర్గ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ నాయకుడు సుఖ్‌దేవ్ చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, హర్యానా, జార్ఖండ్ శాసనసభలకు జరగనున్న ఎన్నికల్లోనూ పాల్గొనబోమన్నారు.
కేవలం ఢిల్లీ విధానసభకు జరిగే ఎన్నికలపైనే దృష్టి సారిస్తామని ఆయన వివరించారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది.
ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.
దృష్టంతా ఢిల్లీ ఎన్నికలపైనే
Published Tue, Aug 26 2014 10:32 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement