ఓల్డ్ సిటీపై ఏఏపీ కన్ను | AAP eye on the Old City | Sakshi
Sakshi News home page

ఓల్డ్ సిటీపై ఏఏపీ కన్ను

Published Mon, Sep 16 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

AAP eye on the Old City

న్యూఢిల్లీ: ముస్లింలు అత్యధికంగా ఉన్న ఓల్డ్ సిటీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్నేసింది. ఇక్కడ తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. స్థానిక ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మేమున్నామంటూ భరోసానిస్తోంది. గతేడాది ఇక్కడ నుంచి భారీ ఓట్లతో గెలిచిన షోయబ్ ఇక్బల్ ఇలాకాలో తమ జెండా రెపరెడలాడేయాలని ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా మటియా మహల్‌లో షాగంజ్ ప్రాంతంలో ఏఏపీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల భారీ స్క్రీన్‌పై ప్రత్యక్షమై ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  
 
 అలాగే కేజ్రీవాల్ రాసిన లేఖను ఆ పార్టీ కార్యకర్తలు ప్రతి గడప గడపకు పంపిణీ చేశారు. గత 65 ఏళ్ల నుంచి 65,000లకు పైగా మత ఘర్షణలు జరిగాయని, వీటన్నింటికి బాధ్యులైన బీజేపీ, కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నాయని అందులో విమర్శించారు. ఉర్ధూ పాఠశాలల దయనీయ స్థితి, శిథిలావస్థలో ఉన్న మదర్సాలు, అవినీతి ఊబిలో చిక్కుకపోయిన వక్ఫ్ బోర్డుతో పాటు జైలు ఊచలు లెక్కపెడుతున్న అమాయక ముస్లింల గురించి వివరించారు. తమ సొంత గడ్డపైనే ముస్లింలు పొరుగింటి ప్రాంతాల వారిగా నివసించాల్సి వస్తోందని తెలిపారు. మైనారిటీవర్గ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న కమిషన్‌ల చురుగ్గా పనిచేయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. 
 
 అయితే తమను అధికారంలోకి తీసుకొస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరించి ముస్లింల అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. ఉర్దూ భాషకు ప్రత్యేక హోదాను ఇస్తామని, మెరుగైన పౌర సేవలు అందిస్తామని, ఉచిత నీటి సరఫరా చేస్తామని, ఉచిత విద్యను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే స్థానికంగా అనేక మంది పార్టీ కార్యకర్తలు లేకపోవడం ఏఏపీకి కాస్త నిరాశ కలిగించే అంశంగా చెప్పవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి పార్టీలో మరింత మంది చేరి స్థానికంగా పటిష్టపరుస్తారన్న ఆశతో ఉంది. 
 
 అయితే ఇక్కడ మంచి నేతగా పేరున్న తక్వి మహమ్మద్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నాయకులు తమ పార్టీలో చేరే అవకాశముందని ఏఏపీ సభ్యుడు ఫిరోజ్ భక్త్ అహ్మద్ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై వారు వివిధ సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారు అనేక మంది ఉన్నారని చెప్పారు. ఇటువంటి వారందరూ ప్రత్యామ్నాయంగా ఏఏపీని ఎంచుకునే అవకాశముందని వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement