న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నియామక అంశంలో కేంద్ర ప్రభుత్వంతో ఆప్ కయ్యానికి కాలు దువ్వుతోంది. బ్యూరోక్రాట్లకు సంబంధించి అత్యున్నత పదవి అయిన సీఎస్ ఎంపిక కోసం ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. వారలో నుంచి ఒకరిని ఎంచుకొని సీఎస్‌గా నియమించుకోవాలని సూచించింది. అయితే, కేంద్రం పంపిన ప్యానల్‌లో ఢిల్లీ సర్కారు సూచించిన ఆర్.ఎస్.నేగీ పేరు లేదు. దీంతో కేంద్రం పంపిన ఈ ప్యానల్‌ను తిరస్కరించాలనే నిర్ణయానికి ఆప్ సర్కారు వచ్చింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న 1984 బ్యాచ్‌కి చెందిన ఆర్.ఎస్.నేగీని సీఎస్‌గా నియమించాలని ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతోంది. సీఎస్‌గా నేగీ పేరును ఖరారు చేయించడం కోసం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని గురువారం సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కలిశారు. నేగీ గతంలో ఢిల్లీ ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారని రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు.
ఢిల్లీ జల్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారని, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై అతనికి మంచి అవగాహన ఉందని చెప్పారు. తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని రాజ్‌నాథ్‌ని కోరారు. కానీ రాజ్‌నాథ్ అందుకు అంగీకరించకుండా, వారి విజ్ఞప్తిని తిరస్కరించారు. అతన్ని నియమించడం వల్ల వచ్చే ఇబ్బంది ఏంటని కేంద్రాన్ని ఆప్ ప్రశ్నిస్తోంది. ఐఏఎస్ రేసులో ఉన్న ఇతర అధికారులతో పోలిస్తే నేగీ చాలా జూనియర్ అని, అతని నియమించడం సర్వీస్ రూల్స్‌కి విరుద్ధం అని కేంద్రం వాదిస్తోంది. వివిధ స్థానాల్లో అతని కంటే సీనియర్‌లైన ఏజీఎంటీయూ కేడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారులు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నేగీని నియమించడం సరికాదని ఢిల్లీ సర్కారుకి కేంద్రం వివరించింది. కాగా, ఆప్ మాత్రం కేంద్రం వాదనను వ్యతిరేకిస్తోంది. మరి అలాంటి జూనియర్ అధికారిని అరుణాచల్‌ప్రదేశ్ వంటి సమస్యాత్మక ప్రాంతానికి సీఎస్‌గా నియమించారని ప్రశ్నిస్తోంది.
కేంద్రం సహకరించాలి..
ప్రజలు తమ ప్రభుత్వంపై చాలా అంచనాలను పెట్టుకున్నారని, వారి కోసం రూపొందించే పథకాల అమలులో కేంద్రం తప్పక సహకారం అందించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కోరింది.
కేంద్రంతో ఆప్ ‘ఢీ’!
Published Sun, Mar 1 2015 10:26 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM
Advertisement
Advertisement