ఆసుపత్రిలో కెప్టెన్
ఆందోళన వద్దన్న నేతలు
సాధారణ పరీక్షలేనని ప్రకటన
చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ ఆసుపత్రిలో చేరారు. మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్సలు అందిస్తున్నారు. ఏడాదికి ఓ మారు జరిగే సాధారణ వైద్య పరీక్షలు మాత్రమేనని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. సినీ నటుడిగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్ డీఎండీకేతో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, అడ్రస్సునూ గల్లంతు చేసుకుని పాతాళంలోకి నెట్టబడ్డారు.
ముఖ్య నాయకులు బయటకు వెళ్లడంతో ఉన్న వారితో పార్టీని నెట్టుకొస్తున్నారు. మీలో ఒక్కడ్ని అన్న నినాదంతో కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునే విధంగా గత ఏడాది ఆగస్టు నుంచి జిల్లా పర్యటనలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఆయన్ను విరుగంబాక్కం ఇంటి నుంచి మనపాక్కంలోని ఓ ప్రైవేటు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు సాగుతున్నాయి. విజయకాంత్ ఆసుపత్రిలో ఉన్న సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఇప్పటికే సింగపూర్‌లో ఆయనకు కొన్ని నెలల పాటుగా వైద్య చికిత్సలతో పాటు శస్త్ర చికిత్స జరిగినట్టు సంకేతాలు ఉన్నాయి.
ఆయనకు మూత్ర పిండాల మార్పిడి జరిగినట్టుగా ప్రచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయాల్లో ఆయన హావాభావాలు, తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కనిపించడంతో ఆరోగ్య పరిస్థితిపై మరో మారు ఆందోళనను రేగాయి. ఆయనకు టాన్సిల్స్ సమస్య ఉన్నట్టు స్వయంగా విజయకాంత్ సతీమణి ప్రేమలత ఆ సమయంలో వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా, విజయకాంత్‌ను చడీ చప్పుడు కాకుండా ఆసుపత్రిలో చేర్పించడం డీఎండీకే వర్గాల్లో ఆందోళనను రేపింది. దీంతో ఆ పార్టీ కార్యాలయం అప్రమత్తం అయింది. విజయకాంత్‌కు ఎలాంటి సమస్య లేదని, ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఏడాదికి ఓ మారు చేయించుకోవాల్సిన సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు వివరించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షల అనంతరం ఒకటి రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని ప్రకటించారు.