అవసరమైతే రాజకీయాల‍్లోకి వస్తా : లారెన్స్
చెన్నై : ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ జల్లికట్టు పోరాటంలో విద్యార్థులకు మద్దతుగా నిలిచి పోరాటంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రముఖ్యమంత్రిని కలిసి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని జల్లికట్టు విజయోత్సవాన్ని నిర్వహించాలని ఆయన మూడు కోరికలను వ్యక్తం చేశారు. కాగా మంగళవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జల్లికట్టులో పాల్గొన్న యువకులతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా లారెన్స్ మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిని కోరిన కోరికలకు ఆయన పాజిటివ్‌గా స్పందించారని తెలిపారు. తాను సామాజిక సేవలో ఇప్పటి వరకు 135 మంది పేదలకు ఉచిత శస్త్ర చికిత్స అందించానని, 200ల మందికి పైగా ఆర్థికసాయంతో పాటు విద్యాసాయం చేస్తున్నానన్నారు. అలాగే 60 మంది అనాథలకు తన ఆశ్రమంలో సంరక్షణా బాధ్యతలను నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు.
కాగా తనకు రాజకీయాలలోకి వచ్చే ఆలోచన లేదని అయితే తనను నమ్ముకున్న వారికి అభద్రతా భావం కలిగితే భవిష్యత్తులో రాజకీయపార్టీని నెలకొల్పడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. కాగా తన ఇయక్కంలో ఏ పార్టీకి చెందని వారికి అవకాశం వుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జల్లికట్టు పోరాటంలో మృతి చెందిన మణికంఠన్ అనే యువకుడి కుటుంబానికి రూ.10 లక్షలు విరాళాన్ని అందించనున్నట్లు తెలిపారు.