టీనగర్ : కార్తిక్ ఆధ్వర్యంలోని విడియల్ కూట్టని తమిళనాడు, పుదుచ్చేరిలలో పోటీ చేసేందుకు నిర్ణయించింది. నటుడు కార్తిక్ ఉసిలంపట్టి లేదా కోవిల్‌పట్టిలో పోటీ చేయనున్నట్లు సమాచారం. నాడాలుం మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు కార్తిక్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొన్నారు. ఇలావుండగా ఆయన ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద పార్టీలతో మంతనాలు జరిపారు. అయితే పెద్ద పార్టీలతో కూటమి ఏర్పాటుకు సాధ్యం కాలేదు. దీంతో కార్తిక్ ఆరు చిన్న పార్టీలను కలుపుకుని విడియల్ కూట్టని పేరుతో కొత్త కూటమిని శుక్రవారం ఏర్పాటుచేశారు.
ఈ కూటమిలో కార్తిక్ నాడాలుం మక్కల్ కట్చి, డాక్టర్ సేతురామన్ అఖిల భారత మూవేందర్ మున్నని కళగం, విద్యాధరన్ నేతృత్వంలోని లోక్‌జన్ శక్తి పార్టీ, సత్యశీలన్ ఆధ్వర్యంలోని దళిత్‌సేన, శక్తివేలు ఆధ్వర్యంలోని మక్కల్ మానాడు కట్చి, గోపి నారాయణన్ యాదవ్ ఆధ్వర్యంలోని తమిళగ మక్కల్ కట్చి చోటుచేసుకున్నాయి.
మరికొన్ని చిన్న పార్టీలతో కూటమికి కార్తిక్ చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్ని నియోజకవర్గాల్లో విడియల్ కూట్టని ద్వారా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించేందుకు కార్తిక్ నిర్ణయించారు. త్వరలో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. నటుడు కార్తిక్ ఉసిలంపట్టి లేదా కోవిల్‌పట్టిలో పోటీ చేయనున్నట్లు సమాచారం.