tamilnadu election
-
జయలలితకు షాక్!
చెన్నై: తమిళనాడులో 'అమ్మ'కు ఈసారి భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని జయలలిత నిలుపుకోవడం కష్టమేనని సర్వేలు చెబుతున్నాయి. కురువృద్ధుడు కరుణానిధిపై తమిళ ఓటర్లు కరుణ చూపారని అంటున్నాయి. 234 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే 114-118, అన్నాడీఎంకే 95-99, పీడబ్ల్యూఎఫ్ 14, బీజేపీ 4 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని తమిళనాడు న్యూస్ నేషన్ సర్వే వెల్లడించింది. డీఎంకే 124-140, అన్నాడీఎంకే 89-101, బీజేపీ 0-3 సీట్లలో విజయం సాధించే అవకాశముందని తమిళనాడు ఇండియాటుడే అంచనా వేసింది. డీఎంకే 106-120, అన్నాడీఎంకే 89-101, పీడబ్ల్యూఎఫ్ 4-8, బీజేపీ 0-3 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని తమిళనాడు యాక్సిస్ ఇండియా సర్వే తెలిపింది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 69.19 శాతం పోలింగ్ నమోదైంది. 8 జిల్లాల్లో వర్షాలు కురవడంతో పోలింగ్ సమయాన్ని రాత్రి 7 గంటలకు వరకు పొడిగించారు. పోలింగ్ శాతం మరింత పెరగనుంది. ఈ నెల 19న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
ఒక ఓటు.. రూ.2 లక్షలు
నేతల అవినీతిపై సెటైర్ వాట్సాప్‌లో హల్చల్ చైతన్య పరుస్తున్న మెసేజ్‌లు ప్రలోభాలకు లొంగొద్దు చెన్నై: ఒక ఓటుకు రూ.500, రూ.5వేలు అని వెలకట్టే ఓ నేతలారా ఈ ఓటు అసలైన విలువ ఎంతో తెలుసా...రూ.2లక్షలు. వినేందుకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా నూరుశాతం నిజం అంటోంది ఒక వాట్సాప్ సందేశం. ప్రజల ఓటుతో అధికారం చేపట్టే నేతల అక్రమార్జన, అందులో ఓటరు వాటా ఎంత అని లెక్కకడుతూ ఓ తమిళపౌరుడు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా చైతన్య ప్రచారం ప్రారంభించాడు.అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. తమిళ నాడు జనాభా సుమారు 7.5 కోట్లు. ఇందులో 1.75 కోట్ల పిల్లలు. మిగతా 5.75 కోట్ల మంది ఓటర్లు. వీరిలో 30 శాతం మంది అంటే కోటి మంది మద్యం తాగేవారున్నారు. ఒక క్వార్టర్ బాటిల్ అమ్మితే రూ.50 లాభం. కోటి బాటిళ్లు అమ్మితే రూ.55 కోట్ల లాభం. అంటే ఏడాదికి రూ.20,075 కోట్లు, ఐదేళ్లకు రూ.లక్ష కోట్లు. ఈ సొమ్ము నీ జేబు నుంచి చోరీ చేయబడుతున్నదే. ఇక ఇసుక ఏడాదికి రూ.25 వేల కోట్లు, ఐదేళ్లకు రూ.1.25లక్షల కోట్లు. అలాగే గ్రానైట్, క్వారీల ద్వారా ఏడాదికి రూ.25 వేల కోట్లు, ఐదేళ్లకు మరో రూ.1.25 లక్షల కోట్లు. ఈ సొమ్ము కూడా నీ జన్మభూమి నుంచి కొల్లగొడుతున్నదే. విద్యుత్ చోరీ: రోజుకు 4వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో యూనిట్‌కు 22 పైసలు కమీషన్ పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మెగావాట్లు లెక్క కడితే నెలకు రూ.66 కోట్లు, ఏడాదికి రూ.24వేల కోట్లు, ఐదేళ్లకు రూ.1.2 లక్షల కోట్లు కమీషన్‌గా స్వాహా చేస్తున్నారు. ఈ డబ్బంతా ప్రజల నుంచే కదా. కొల్లగొడుతున్న ప్రజా పనుల శాఖ: ప్రభుత్వ నిర్మాణ పనుల పేరున ప్రభుత్వ ఖజానాకు పరోక్షంగా రూ.5లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, ఉద్యోగ నియామకాలతో లక్ష కోట్లు, ఉచితాల పంపిణీ ముసుగులో రూ. రూ.2లక్షల కోట్లు లెక్కన ఖజానాకు మొత్తం రూ.10లక్షల కోట్ల గండిపడుతోంది. మొత్తం పది విభాగాల్లో రూ.15 లక్షల కోట్లు పరోక్షంగా దోచేసుకుంటున్నారు. ఈ మోసాలు, కుంభకోణాలు లెక్క కడితే రాష్ట్రంలోని 5.75 కోట్ల ఓటర్లకు సరాసరిగా రూ.2లక్షలు చెల్లించవచ్చని వాట్సాప్ సందేశం. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము నుంచే ఓటుకు రూ.500, రూ.1000గా చెల్లిస్తున్నారు. ప్రభుత్వాల్లో జరుగుతున్న దోపిడీపై ఓటర్లలో ఒక చైతన్యం కలిగించేందుకు మాత్రమే ఈ వివరాలు చెబుతున్నామేగానీ ఓటుకు రూ.2లక్షలు డిమాండ్ చేయమని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి, తప్పుచేసిన ప్రభుత్వాలను నిర్భయంగా నిలదీయండి అంటూ అతను ముక్తాయింపు ఇచ్చాడు. -
ఏమిటీ ఘోరం
ఐదుగురి మృతి దురదృష్టకరమని వ్యాఖ్య ప్రభుత్వానికి జాతీయ హక్కుల కమిషన్ నోటీసు రెండువారాల్లోగా బదులివ్వాలని ఆదేశం మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఐదుగురి అకాలమృతికి కారణమైన అన్నాడీఎంకే ప్రచారసభలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం పేదల ప్రాణాలను హరించడమా అంటూ నిలదీసింది. ఈ ఘోరాలపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కమిషన్ నోటీసు జారీచేసింది. చెన్నై : అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడం కోసం పార్టీ అధినేత్రి జయలలిత సేలంలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన ఇద్దరు వ్యక్తులు ఎండవేడిమి తాళలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అలాగే విరుదాచలంలో నిర్వహించిన సభలో మరో ఇద్దరు, అరుప్పుకోట్లలో ఒకరు ఇలా మొత్తం ఐదుగురు మృతి చెందారు. బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోలేదు. బహిరంగ సభ కోసం పిలుచుకు వచ్చిన ప్రజలను 100 డిగ్రీలకు పైగా కాలుతున్న ఎండలో సుమారు ఐదుగంటల పాటు ఉంచడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అన్నాడీఎంకే సభ నిర్వాహకులపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా డీఎంకే, డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్ ఈనెల 2వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి. ‘మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని అన్ని రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సభల వద్ద తాగునీరు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు, భద్రతా చర్యలు తీసుకుని ఉన్నారా అని తనిఖీ చేసిన తరువాతనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాగం సైతం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని తేటతెల్లమైంది. వేసవి తీవ్రతగా ఉన్న సమయంలో సభలకు అనుమతి ఇవ్వరాదనే నిబంధన ఉన్నా అధికారులు పాటించక పోవడం దురదృష్టకరం. ప్రజల సంక్షేమం కోసం, మానవ హక్కుల ఉల్లంఘన జరుగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఫిర్యాదుల్లో పేర్కొన్న ప్రకారం విరుదాచలం, సేలం, విరుదునగర్ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఐదుగురు మృత్యువాత పడిన సంఘటనలపైనా, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా తీసుకోనున్న చర్యలపై రెండువారాల్లోగా సవివరమైన నివేదికను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. -
పోటీలో కార్తిక్ పార్టీ
టీనగర్ : కార్తిక్ ఆధ్వర్యంలోని విడియల్ కూట్టని తమిళనాడు, పుదుచ్చేరిలలో పోటీ చేసేందుకు నిర్ణయించింది. నటుడు కార్తిక్ ఉసిలంపట్టి లేదా కోవిల్పట్టిలో పోటీ చేయనున్నట్లు సమాచారం. నాడాలుం మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు కార్తిక్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ప్రచారంలో పాల్గొన్నారు. ఇలావుండగా ఆయన ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద పార్టీలతో మంతనాలు జరిపారు. అయితే పెద్ద పార్టీలతో కూటమి ఏర్పాటుకు సాధ్యం కాలేదు. దీంతో కార్తిక్ ఆరు చిన్న పార్టీలను కలుపుకుని విడియల్ కూట్టని పేరుతో కొత్త కూటమిని శుక్రవారం ఏర్పాటుచేశారు. ఈ కూటమిలో కార్తిక్ నాడాలుం మక్కల్ కట్చి, డాక్టర్ సేతురామన్ అఖిల భారత మూవేందర్ మున్నని కళగం, విద్యాధరన్ నేతృత్వంలోని లోక్‌జన్ శక్తి పార్టీ, సత్యశీలన్ ఆధ్వర్యంలోని దళిత్సేన, శక్తివేలు ఆధ్వర్యంలోని మక్కల్ మానాడు కట్చి, గోపి నారాయణన్ యాదవ్ ఆధ్వర్యంలోని తమిళగ మక్కల్ కట్చి చోటుచేసుకున్నాయి. మరికొన్ని చిన్న పార్టీలతో కూటమికి కార్తిక్ చర్చలు జరుపుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్ని నియోజకవర్గాల్లో విడియల్ కూట్టని ద్వారా అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించేందుకు కార్తిక్ నిర్ణయించారు. త్వరలో అభ్యర్థుల జాబితా విడుదల చేయనున్నారు. నటుడు కార్తిక్ ఉసిలంపట్టి లేదా కోవిల్పట్టిలో పోటీ చేయనున్నట్లు సమాచారం. -
డీఎంకేతో ఎంఎంకే
చెన్నై: డీఎంకేతో పయనం సాగించేందుకు ఎంఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ నేత జవహరుల్లా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఇక, డీఎంకేకు ఇప్పటి వరకు 98 ప్రజా, వివిధ సామాజిక వర్గాల సంఘాలు మద్దతు ప్రకటిస్తూ లేఖల్ని సమర్పించడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి మనిద నేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) పయనం సాగించింది. మూడు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. తదుపరి అన్నాడీఎంకేకు దూరంగా ఎంఎంకే నేతలు వ్యవహరించడం మొదలెట్టారు. లోక్ సభ ఎన్నికల్ని డీఎంకేతో కలిసి ఎదుర్కొన్నారు. తదుపరి ప్రజా కూటమితో కలసి పయనం సాగించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అన్నాడీఎంకేకు దగ్గరయ్యే విధంగా పార్టీ నేత , ఎమ్మెల్యే జవహరుల్లా వ్యవహరించడంతో ఎంఎంకేలో పెద్ద రగడే చోటు చేసుకుని చివరకు చీలిక సైతం వచ్చింది. ఎంఎంకే నుంచి బయటకు వచ్చిన వాళ్లు తమీమున్ అన్సారి నేతృత్వంలో మనిదనేయ జననాయగ కట్చి(ఎంజేకే)ను ప్రకటించి, ఆవిర్భావ వేడుకకు సిద్ధం అవుతున్నారు. డీఎంకేతో కలసి తమ పయనం సాగించే విధం గా ఎంజేకే వర్గాలు ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఎంఎంకే నేత జవహరుల్లా మనస్సు మార్చుకున్నట్టుంది. రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో అన్నాడీఎంకేతో పొత్తుకు వ్యతిరేకంగా నాయకులు గళం విప్పడంతో, ఇక డీఎంకేతో కలసి అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అయితే, అన్నాడీఎంకే నుంచి పిలుపు రాకపోవడంతోనే డీఎంకే వైపు దృష్టి పెట్టారన్న ప్రచారాలు సైతం ఉన్నాయి. అయితే, తమ పయనం కొనసాగుతుందంటూ ఎంఎంకే నేత జవహరుల్లా ప్రకటించడం విశే షం. అయితే, ఈ ప్రకటన ఎంజేకే వర్గాలకు షాక్ ఇచ్చినట్టు అయింది. రెండు కత్తులు ఓ ఒరలో ఇమడడం కష్టం అన్నట్టుగా ఎంజేకే పరిస్థితి నెల కొని ఉన్నది. తదుపరి తమ దారి ఎటో తేల్చుకునేందుకు తమీమున్ అన్సారీ నేతృత్వంలోని ఎంజేకే వర్గాలు సమాలోచనలో పడ్డారు. స్టాలిన్‌తో భేటీ : డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో జవహరుల్లా నేతృత్వంలో బృందం భేటీ అయింది. ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి తగ్గ అంశాలపై సాగిన చర్చలు ఫలించాయి. స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించిన జవహరుల్లా మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల నుంచి తాము డీఎంకేతో కలిసి అడుగులు వేస్తున్నామని, ఈ పయనం కొనసాగుతుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు డిఎంకేకు అని, పొత్తు మంతనాలు సత్ఫలితాల్ని ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక, ఎస్డీపీఐ వర్గాలు తమ మద్దతును డీఎంకేకు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధితో భేటీకి ఆ పార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డీఎంకే వెంట ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పయనం సాగిస్తున్నది. తాజాగా ఎంఎంకే చేరడం, తదుపరి ఎస్డీపీఐ అడుగు పెట్టిన పక్షంలో మూడు మైనారిటీ పార్టీలు డీఎంకే వెంట ఉన్నట్టే. ఇప్పటి వరకు డీఎంకేకు 98 ప్రజా, వివిధ సామాజిక వర్గాల సంఘాలు మద్దతు ప్రకటించడమే కాకుండా, అందుకు తగ్గ లేఖల్ని స్టాలిన్‌కు సమర్పించి ఉండడం విశేషం. డీఎంకే కూటమి బలం పెరుగుతుండడంతో, ఇక సీట్ల పందేరానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రెండు రోజుల్లో డీఎంకే కమిటీతో భేటీకి ఈవీకేఎస్ ఇళంగోవన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. స్టాలిన్ తాజా పరిణామాల గురించి ప్రస్తావిస్తూ, తమ బలం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. డీఎండీకే విషయంగా ప్రశ్న సంధించగా, గతంలో కరుణానిధి ఆహ్వానించారని, అయితే, వారితో తాము ఎలాంటి చర్చలకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. రావడ మా...వద్దా అన్నది వారి వ్యక్తిగతం అని అందులో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించారు. -
కసరత్తుల్లో ‘అమ్మ’
కేవలం మేనిఫెస్టోకు పరిమితం జాబితా కసరత్తుల్లో ‘అమ్మ’ చెన్నై: అన్నాడీఎంకేలో ఐదుగురు నేతలపై అధినేత్రి, సీఎం జె.జయలలిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుంది. ఇన్నాళ్లు ఆ ఐదుగురికి ప్రత్యేక హోదా కల్పించగా, ప్రస్తుతం సీను మారినట్టుంది. ఇక వారికి చెక్ పెట్టినట్టేనా అన్న ప్రశ్న బయల్దేరింది. ఇందుకు అద్దం పట్టే విధంగా అన్నాడీఎంకేలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకేలో గానీయండి, ప్రభుత్వ వ్యవహారాల్లో గానీయండి ఐదుగురు మంత్రులకు సీఎం, అధినేత్రి జయలలిత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవ్వరు చిన్న తప్పు చేసినా, వారికి ఉద్వాసనే. ఆ దిశగా ఇటీవలి కాలంగా మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, పళనియప్పన్లకు ఆ ప్రాధాన్యత ఉంటూ వస్తోంది. ఈ ఐదుగురితో చర్చించిన అనంతరం నిర్ణయాలు తీసుకుంటున్నారు జయ. అలాగే, సీఎం వెంట ఈ ఐదుగురు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కసరత్తుల వేగం పెరిగే కొద్ది ఈ ఐదుగురిపై ఆరోపణలు బయలు దేరుతూ వస్తున్నాయి. సీట్ల పేరిట సాగించి ఉన్న బండారాలు కొన్ని మీడియాల్లో కథనాల రూపంలో వెలువడుతూ వస్తున్నాయి. ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయో ఏమోగానీ, చిన్న పాటి ఆరోపణలు వస్తే చాలు కన్నెర్ర చేసే జయలలిత, ఈ ఐదుగురిపై అదే ధోరణి అనుసరించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఆ ఐదుగురి మద్దతుదారులకు ఉద్వాసనల పర్వం సాగిస్తూ వస్తున్నారు. ఇక, ఈ ఐదుగురి లేనిదే సమీక్షలు, సమావేశాలు, సమాలోచనలు జరిగేవి కాదు. అయితే, ఇప్పుడు ఆ ఐదుగుర్ని జయలలిత పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, వీరితో పాటుగా మరో 14 మంది ఎన్నికల మేనిఫెస్టో తయారీ కమిటీలో ఉండడంతో, ఇప్పటికిప్పుడే వారికి చెక్ పెట్టకుండా, మేనిఫెస్టో పూర్తికా గానే, కన్నెర్ర చేయడానికి సీఎం జయలలిత నిర్ణయించి ఉన్నట్టుగా సమాచారాలు వెలువడుతుండడం గమనార్హం. ఇందుకు అద్దం పట్టే రీతిలో అభ్యర్థుల ఇంటర్వ్యూల పర్వాన్ని సాగించి ఉన్నారు. ఐదుగురికి బదులుగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, మైనారిటీ విభాగం నాయకులు తమిళ్ మగన్ హుస్సేన్, సెల్వ రాజ్‌లకు తన ముందు కూర్చునే అవకాశాన్ని జయలలిత కల్పించి ఉండడం గమనించాల్సిన విషయం. అలాగే అమ్మను కలిసేందుకు ప్రయత్నించిన ఆ ఐదుగురికే కాదు, ఆ కమిటీలో ఉన్న మిగిలిన 14 మందికి సైతం పోయేస్ గార్డెన్‌లోకి అనుమతి లభించక పోవడం గమనార్హం. బయటి నుంచి ఫోన్లో అమ్మతో మాట్లాడి వెనుదిరగాల్సిన పరిస్థితి ఐదుగురికి ఏర్పడి ఉండడంతో, తదుపరి అమ్మ అడుగు ఎలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ అన్నాడీఎంకేలో బయలు దేరి ఉన్నది. అలాగే, అభ్యర్థుల జాబితా పూర్తి ప్రక్రియ అమ్మ కనుసన్నలోనే జరుగుతుండడం గమనార్హం. వంద మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేసి ఉన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇందులో 90 మంది కొత్త ముఖాలుగా సమాచారాలు వస్తుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనూ గుబులు బయలు దేరి ఉన్నది.