ఏమిటీ ఘోరం | five die in election campaign in tamilnadu due to sunstroke | Sakshi
Sakshi News home page

ఏమిటీ ఘోరం

Published Wed, May 4 2016 3:06 PM | Last Updated on Sun, Sep 3 2017 11:24 PM

five die in election campaign in tamilnadu due to sunstroke

ఐదుగురి మృతి దురదృష్టకరమని వ్యాఖ్య
ప్రభుత్వానికి జాతీయ హక్కుల కమిషన్ నోటీసు
రెండువారాల్లోగా బదులివ్వాలని ఆదేశం
 
మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఐదుగురి అకాలమృతికి కారణమైన అన్నాడీఎంకే ప్రచారసభలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మండిపడింది. రాజకీయ ప్రయోజనాల కోసం పేదల ప్రాణాలను హరించడమా అంటూ నిలదీసింది. ఈ ఘోరాలపై రెండువారాల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి కమిషన్ నోటీసు జారీచేసింది.
 
చెన్నై : అన్నాడీఎంకే అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేయడం కోసం పార్టీ అధినేత్రి జయలలిత సేలంలో బహిరంగ సభ నిర్వహించారు. సభకు హాజరైన ఇద్దరు వ్యక్తులు ఎండవేడిమి తాళలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అలాగే విరుదాచలంలో నిర్వహించిన సభలో మరో ఇద్దరు, అరుప్పుకోట్లలో ఒకరు ఇలా మొత్తం ఐదుగురు మృతి చెందారు. బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఎటువంటి ప్రాథమిక సౌకర్యాలు, జాగ్రత్తలు తీసుకోలేదు. బహిరంగ సభ కోసం పిలుచుకు వచ్చిన ప్రజలను 100 డిగ్రీలకు పైగా కాలుతున్న ఎండలో సుమారు ఐదుగంటల పాటు ఉంచడం వల్లనే ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి.
 
ఎన్నికల ప్రచార సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అన్నాడీఎంకే సభ నిర్వాహకులపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా డీఎంకే, డీఎండీకే, పీఎంకే తదితర పార్టీలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమిషన్ ఈనెల 2వ తేదీన  ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల వివరాలు ఇలా ఉన్నాయి. ‘మండుటెండల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని అన్ని రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల సభల వద్ద తాగునీరు, ప్రాథమిక చికిత్స సదుపాయాలు, భద్రతా చర్యలు తీసుకుని ఉన్నారా అని తనిఖీ చేసిన తరువాతనే అనుమతి ఇవ్వాల్సి ఉంది.
 
 అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాగం సైతం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని తేటతెల్లమైంది. వేసవి తీవ్రతగా ఉన్న సమయంలో సభలకు అనుమతి ఇవ్వరాదనే నిబంధన ఉన్నా అధికారులు పాటించక పోవడం దురదృష్టకరం. ప్రజల సంక్షేమం కోసం, మానవ హక్కుల ఉల్లంఘన జరుగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అయితే ఫిర్యాదుల్లో పేర్కొన్న ప్రకారం విరుదాచలం, సేలం, విరుదునగర్ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఐదుగురు మృత్యువాత పడిన సంఘటనలపైనా, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా తీసుకోనున్న చర్యలపై రెండువారాల్లోగా సవివరమైన నివేదికను దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను జాతీయ మానవహక్కుల కమిషన్ ఆదేశించింది.             

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement