చెన్నై: డీఎంకేతో పయనం సాగించేందుకు ఎంఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ నేత జవహరుల్లా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఇక, డీఎంకేకు ఇప్పటి వరకు 98 ప్రజా, వివిధ సామాజిక వర్గాల సంఘాలు మద్దతు ప్రకటిస్తూ లేఖల్ని సమర్పించడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి మనిద నేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) పయనం సాగించింది.
మూడు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. తదుపరి అన్నాడీఎంకేకు దూరంగా ఎంఎంకే నేతలు వ్యవహరించడం మొదలెట్టారు. లోక్ సభ ఎన్నికల్ని డీఎంకేతో కలిసి ఎదుర్కొన్నారు. తదుపరి ప్రజా కూటమితో కలసి పయనం సాగించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అన్నాడీఎంకేకు దగ్గరయ్యే విధంగా పార్టీ నేత , ఎమ్మెల్యే జవహరుల్లా వ్యవహరించడంతో ఎంఎంకేలో పెద్ద రగడే చోటు చేసుకుని చివరకు చీలిక సైతం వచ్చింది.
ఎంఎంకే నుంచి బయటకు వచ్చిన వాళ్లు తమీమున్ అన్సారి నేతృత్వంలో మనిదనేయ జననాయగ కట్చి(ఎంజేకే)ను ప్రకటించి, ఆవిర్భావ వేడుకకు సిద్ధం అవుతున్నారు. డీఎంకేతో కలసి తమ పయనం సాగించే విధం గా ఎంజేకే వర్గాలు ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఎంఎంకే నేత జవహరుల్లా మనస్సు మార్చుకున్నట్టుంది.
రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో అన్నాడీఎంకేతో పొత్తుకు వ్యతిరేకంగా నాయకులు గళం విప్పడంతో, ఇక డీఎంకేతో కలసి అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అయితే, అన్నాడీఎంకే నుంచి పిలుపు రాకపోవడంతోనే డీఎంకే వైపు దృష్టి పెట్టారన్న ప్రచారాలు సైతం ఉన్నాయి.
అయితే, తమ పయనం కొనసాగుతుందంటూ ఎంఎంకే నేత జవహరుల్లా ప్రకటించడం విశే షం. అయితే, ఈ ప్రకటన ఎంజేకే వర్గాలకు షాక్ ఇచ్చినట్టు అయింది. రెండు కత్తులు ఓ ఒరలో ఇమడడం కష్టం అన్నట్టుగా ఎంజేకే పరిస్థితి నెల కొని ఉన్నది. తదుపరి తమ దారి ఎటో తేల్చుకునేందుకు తమీమున్ అన్సారీ నేతృత్వంలోని ఎంజేకే వర్గాలు సమాలోచనలో పడ్డారు.
స్టాలిన్‌తో భేటీ : డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో జవహరుల్లా నేతృత్వంలో బృందం భేటీ అయింది. ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి తగ్గ అంశాలపై సాగిన చర్చలు ఫలించాయి. స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించిన జవహరుల్లా మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల నుంచి తాము డీఎంకేతో కలిసి అడుగులు వేస్తున్నామని, ఈ పయనం కొనసాగుతుందని ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు డిఎంకేకు అని, పొత్తు మంతనాలు సత్ఫలితాల్ని ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక, ఎస్‌డీపీఐ వర్గాలు తమ మద్దతును డీఎంకేకు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధితో భేటీకి ఆ పార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డీఎంకే వెంట ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పయనం సాగిస్తున్నది.
తాజాగా ఎంఎంకే చేరడం, తదుపరి ఎస్‌డీపీఐ అడుగు పెట్టిన పక్షంలో మూడు మైనారిటీ పార్టీలు డీఎంకే వెంట ఉన్నట్టే. ఇప్పటి వరకు డీఎంకేకు 98 ప్రజా, వివిధ సామాజిక వర్గాల సంఘాలు మద్దతు ప్రకటించడమే కాకుండా, అందుకు తగ్గ లేఖల్ని స్టాలిన్‌కు సమర్పించి ఉండడం విశేషం. డీఎంకే కూటమి బలం పెరుగుతుండడంతో, ఇక సీట్ల పందేరానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రెండు రోజుల్లో డీఎంకే కమిటీతో భేటీకి ఈవీకేఎస్ ఇళంగోవన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు.
స్టాలిన్ తాజా పరిణామాల గురించి ప్రస్తావిస్తూ, తమ బలం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. డీఎండీకే విషయంగా ప్రశ్న సంధించగా, గతంలో కరుణానిధి ఆహ్వానించారని, అయితే, వారితో తాము ఎలాంటి చర్చలకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. రావడ మా...వద్దా అన్నది వారి వ్యక్తిగతం అని అందులో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించారు.