MMK
-
డీఎంకేతో ఎంఎంకే
చెన్నై: డీఎంకేతో పయనం సాగించేందుకు ఎంఎంకే నిర్ణయించింది. ఆ పార్టీ నేత జవహరుల్లా డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఇక, డీఎంకేకు ఇప్పటి వరకు 98 ప్రజా, వివిధ సామాజిక వర్గాల సంఘాలు మద్దతు ప్రకటిస్తూ లేఖల్ని సమర్పించడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి మనిద నేయ మక్కల్ కట్చి(ఎంఎంకే) పయనం సాగించింది. మూడు చోట్ల పోటీ చేసి రెండు స్థానాల్ని ఆ పార్టీ కైవసం చేసుకుంది. తదుపరి అన్నాడీఎంకేకు దూరంగా ఎంఎంకే నేతలు వ్యవహరించడం మొదలెట్టారు. లోక్ సభ ఎన్నికల్ని డీఎంకేతో కలిసి ఎదుర్కొన్నారు. తదుపరి ప్రజా కూటమితో కలసి పయనం సాగించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ అన్నాడీఎంకేకు దగ్గరయ్యే విధంగా పార్టీ నేత , ఎమ్మెల్యే జవహరుల్లా వ్యవహరించడంతో ఎంఎంకేలో పెద్ద రగడే చోటు చేసుకుని చివరకు చీలిక సైతం వచ్చింది. ఎంఎంకే నుంచి బయటకు వచ్చిన వాళ్లు తమీమున్ అన్సారి నేతృత్వంలో మనిదనేయ జననాయగ కట్చి(ఎంజేకే)ను ప్రకటించి, ఆవిర్భావ వేడుకకు సిద్ధం అవుతున్నారు. డీఎంకేతో కలసి తమ పయనం సాగించే విధం గా ఎంజేకే వర్గాలు ప్రయత్నాల్లో ఉన్న సమయంలో ఎంఎంకే నేత జవహరుల్లా మనస్సు మార్చుకున్నట్టుంది. రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో అన్నాడీఎంకేతో పొత్తుకు వ్యతిరేకంగా నాయకులు గళం విప్పడంతో, ఇక డీఎంకేతో కలసి అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. అయితే, అన్నాడీఎంకే నుంచి పిలుపు రాకపోవడంతోనే డీఎంకే వైపు దృష్టి పెట్టారన్న ప్రచారాలు సైతం ఉన్నాయి. అయితే, తమ పయనం కొనసాగుతుందంటూ ఎంఎంకే నేత జవహరుల్లా ప్రకటించడం విశే షం. అయితే, ఈ ప్రకటన ఎంజేకే వర్గాలకు షాక్ ఇచ్చినట్టు అయింది. రెండు కత్తులు ఓ ఒరలో ఇమడడం కష్టం అన్నట్టుగా ఎంజేకే పరిస్థితి నెల కొని ఉన్నది. తదుపరి తమ దారి ఎటో తేల్చుకునేందుకు తమీమున్ అన్సారీ నేతృత్వంలోని ఎంజేకే వర్గాలు సమాలోచనలో పడ్డారు. స్టాలిన్‌తో భేటీ : డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌తో జవహరుల్లా నేతృత్వంలో బృందం భేటీ అయింది. ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి తగ్గ అంశాలపై సాగిన చర్చలు ఫలించాయి. స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించిన జవహరుల్లా మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికల నుంచి తాము డీఎంకేతో కలిసి అడుగులు వేస్తున్నామని, ఈ పయనం కొనసాగుతుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ మద్దతు డిఎంకేకు అని, పొత్తు మంతనాలు సత్ఫలితాల్ని ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక, ఎస్డీపీఐ వర్గాలు తమ మద్దతును డీఎంకేకు ప్రకటించేందుకు సిద్ధమయ్యాయి. డీఎంకే అధినేత కరుణానిధితో భేటీకి ఆ పార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డీఎంకే వెంట ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పయనం సాగిస్తున్నది. తాజాగా ఎంఎంకే చేరడం, తదుపరి ఎస్డీపీఐ అడుగు పెట్టిన పక్షంలో మూడు మైనారిటీ పార్టీలు డీఎంకే వెంట ఉన్నట్టే. ఇప్పటి వరకు డీఎంకేకు 98 ప్రజా, వివిధ సామాజిక వర్గాల సంఘాలు మద్దతు ప్రకటించడమే కాకుండా, అందుకు తగ్గ లేఖల్ని స్టాలిన్‌కు సమర్పించి ఉండడం విశేషం. డీఎంకే కూటమి బలం పెరుగుతుండడంతో, ఇక సీట్ల పందేరానికి కాంగ్రెస్ సిద్ధమైంది. రెండు రోజుల్లో డీఎంకే కమిటీతో భేటీకి ఈవీకేఎస్ ఇళంగోవన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు శనివారం ప్రకటించారు. స్టాలిన్ తాజా పరిణామాల గురించి ప్రస్తావిస్తూ, తమ బలం పెరుగుతున్నదని వ్యాఖ్యానించారు. డీఎండీకే విషయంగా ప్రశ్న సంధించగా, గతంలో కరుణానిధి ఆహ్వానించారని, అయితే, వారితో తాము ఎలాంటి చర్చలకు వెళ్ల లేదని స్పష్టం చేశారు. రావడ మా...వద్దా అన్నది వారి వ్యక్తిగతం అని అందులో జోక్యం చేసుకోబోమని వ్యాఖ్యానించారు. -
ఎంఎంకేలో వార్
సాక్షి, చెన్నై : మనిద నేయమక్కల్ కట్చి(ఎంఎంకే)లో వార్ బయలు దేరింది. పార్టీని చీల్చేందుకు మంగళవారం ప్రధాన కార్యదర్శి తమీమ్ అన్సారి యత్నించారు. పెద్దల జో క్యంతో ఆ ప్రయత్నాన్ని విరమించి సామరస్యానికి తమీమ్ సిద్ధమయ్యారు. దీంతో ఆగమేఘాలపై పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఎంఎంకే నేత, ఎమ్మెల్యే జవహరుల్లా ఏర్పాటు చేశారు. భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. తమిళనాడు ముస్లిం మున్నేట్ర కళగంలో భాగంగా, రాష్ర్టంలో అత్యధిక మైనారిటీల ఓటు బ్యాంక్ కల్గిన పార్టీగా మనిదనేయ మక్కల్‌కట్చి(ఎంఎంకే) అవతరించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మూడుచోట్ల తమ అభ్యర్థుల్ని నిలబెట్టగా, ఇద్దరు అఖండ మెజా రిటీతో గెలిచారు. మరొకరు స్వల్ప ఓట్లతో ఓటమి చవి చూశారు. ఆ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలసి ఎదుర్కొన్న ఈ పార్టీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో డిఎంకే పక్షాన చేరింది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఐదు పార్టీల ప్రజా కూటమితో కలసి కొన్నాళ్లు పనిచేసి, చివరకు అందులో నుంచి కూడా బయటకు వచ్చి, భవిష్యత్ ప్రణాళిక మీద దృష్టి పెట్టారు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే జవహరుల్లా. వార్..చీలిక యత్నం : పార్టీ నేత జవహరుల్లా ఇటీవలి కాలంగా వ్యవహరిస్తున్నతీరు ఆ పార్టీలో అసంతృప్తిని రగిల్చింది. రానున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పనిచేద్దామన్న నిర్ణయానికి జవహరుల్లా వచ్చి ఉండటాన్ని అసంతృప్తి వాదులు వ్యతిరేకించి ఉన్నారు. అదే సమయంలో తమ వ్యతిరేకతను చాటుకునే రీతిలో సోమవారం తిరువారూర్ వేదికగా జరిగిన ప్రజా కూటమి సదస్సులో అసంతృప్తి వాదులు ప్రత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. ఈ బృందానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమీమ్ అన్సారి నేతృత్వం వహించడం గమనార్హం. ఆ వేదిక మీద ప్రత్యక్షం కావడంతో పాటుగా జవహరుల్లాపై బహిరంగ వార్‌కు రెడీ అయ్యారు. ఇందు కోసం మంగళవారం ఎగ్మూర్ సిరాజ్ మహల్ వేదికగా ఎంఎంకే సర్వ సభ్య సమావేశానికి పిలుపు నిచ్చారు. ఈ సమాచారంతో మేల్కొన్న జవహరుల్లా తాంబరం వేదికగా పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపు నివ్వడంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ బయలు దేరింది. బొటాబొటీగా సాగబోతున్న సర్వ సభ్య సమావేశాలతో ఇక, ఎంఎంకే చీలినట్టేనన్న ప్రశ్న, ప్రచారం బయలు దేరింది. ఇంతలో తమిళనాడు ముస్లీం మున్నేట్ర కళగం పె ద్దలు రంగంలోకి దిగడంతో వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టుంది. వెనక్కి తమీమ్: ముస్లీం సామాజిక వర్గంతో నిండిన ఎంఎంకేలో చీలిక యత్నం సమాచారంతో ఉదయాన్నే ఉత్కంఠ నెలకొంది. ఎగ్మూర్ సిరాజ్ మహల్‌కు తమీమ్ నేతృత్వంలో ఆ పార్టీ వర్గాలు తరలి వచ్చారు. అలాగే, తాంబరం వేదికకు తమిళనాడు ముస్లీ మున్నేట్ర కళగంతో పాటుగా, ఎంఎంకే నేత జవహరుల్లాతో కలసి పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చాయి. ఇంతలో హఠాత్తుగా తమీమ్ వెనక్కి తగ్గారు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, సిరాజ్ మహల్ వేదికగా నిర్వహించ తలబెట్టిన సర్వ సభ్య సమావేశాన్ని వాయిదా వేసుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీలో వివాదాలు వద్దంటూ పెద్దలు సూచించారని, అలాగే, వీసీకే నేత తిరుమావళవన్, నామ్ తమిళర్ కట్చినేత సీమాన్ తనతో మాట్లాడారని, పార్టీలో ఎలాంటి చీలికలు వద్దు , సామరస్య పూర్వకంగా కలిసి మెలిసి పనిచేయాలని సూచించారని, అందుకే తన ప్రయత్నాల్ని విరమించుకున్నట్టు ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణ : తాంబరం వేదికగా జరిగిన సభకు తమీమ్ అన్సారి అండ్ బృందం దూరంగా ఉన్నా, జవహరుల్లా నేతృత్వంలో సర్వ సభ్య సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీలో నెలకొన్న అనిచిత పరిస్థితి, సమస్యలను సమీక్షించి, పునారవృతం కాకుండా జాగ్రత్తలకు సిద్ధమయ్యారు. ఆ సమావేశం తీరా్మానాలు ప్రకటించాల్సి ఉంది. ఇక, ఈ సమావేశానికి ముందుగా జవహరుల్లా మాట్లాడుతూ, ఎంఎంకేను చీల్చేందుకు పెద్ద కుట్ర జరుగుతున్నదని ధ్వజమెత్తారు. ఈ కుట్ర చేస్తున్న వాళ్లెవరో త్వరలో తేలుతుందన్నారు. సర్వ సభ్య సమావేశానికి 95 శాతం మంది తరలి వచ్చారని, తమీమ్ తన సమావేశాన్ని రద్దు చేసుకున్నట్టు సంకేతాలు వచ్చాయన్నారు. ఎంఎంకేను నిర్వీర్యం చేయడం ఎవరి తరం కాదు అని, ఎన్నికుట్రలు చేసినా భగ్నం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మహిళకేదీ భద్రత?
సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై చర్చకు సీపీఎం, సీపీఐ, ఎంఎంకే, డీఎంకేలు పట్టుబట్టాయి. ప్రత్యేక వాయిదా తీర్మానం ఇచ్చాయి. దీంతో చర్చకు స్పీకర్ ధనపాల్ అనుమతించారు. సీపీఎం సభ్యుడు సౌందరరాజన్, సీపీఐ సభ్యుడు గుణ శేఖరన్, డీఎంకే సభ్యుడు చక్రపాణి, ఎంఎంకే సభ్యుడు అస్లాం బాషా ప్రసంగించారు. వీరి ప్రసంగాలకు మరి కాసేపట్లో మంత్రి వేలుమణి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ సమయంలో డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ జోక్యం చేసుకుని మంత్రి వివరణ అనంతరం రాష్ట్రంలో మహిళా భద్రత, అత్యాచార పరంపరలపై చర్చకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు. వాకౌట్ : మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకూ పేట్రేగుతున్నా, కట్టడి చేయరా.? అంటూ ప్రభుత్వాన్ని నిలదీయడానికి స్ట్టాలిన్ యత్నించారు. చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, స్పీకర్ ధనపాల్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనని నినాదాలతో హోరెత్తించినా, స్పీకర్ తగ్గలేదు. దీంతో సభ నుంచి వాకౌట్ చేశారు. వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ర్టంలో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర గణాంకాలను బట్టి చూస్తే, ప్రతి ఏటా రాష్ట్రంలో మహిళలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 -18 ఏళ్ల లోపు వారు 250, 18-30 ఏళ్ల లోపు వారు 395, 30-50 ఏళ్ల లోపు వారు 93, 50 ఏళ్లు పైబడ్డ వాళ్లు 14 మంది గత ఏడాది లైంగిక దాడులకు గురైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. 2012లో కంటే, 13లో మహిళలపై దాడులు రాష్ట్రంలో పెరిగాయని, ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో మరెన్నో దారుణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తాము పట్టుబడితే స్పీకర్ నిరాకరించారని విమర్శించారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు. తాగునీటికి భరోసా : డీఎంకే వాకౌట్ అనంతరం తాగునీటి ఎద్దడిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజలకు ప్రభుత్వ భరోసాను వివరిస్తూ మంత్రి వేలుమణి ప్రసంగించారు. గత ఏడాది ఈరోడ్, కన్యాకుమారి, తిరునల్వేలి, తదితర 11 జిల్లాల్లో మాత్రం ఆశించిన మేరకు వర్షాలు పడ్డాయని వివరించారు. 20 జిల్లాల్లో పూర్తిగా వర్షాలు ముఖం చాటేశాయని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చకుండా తాము చర్యలు తీసుకున్నామని వివరించారు. రూ.651 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకాల ద్వారా రోజుకు 1442 మిలియన్ లీటర్ల నీరు దక్కుతోందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో తాగునీటి సమస్య పరిష్కార లక్ష్యంగా చేపట్టిన అన్ని పనులు ఈ నెలాఖరులోపు ముగియనున్నాయని వివరించారు. చెన్నైకు తాగు నీటి ఎద్దడి రానివ్వకుండా చర్యలు చేపట్టామన్నారు. తెలుగు గంగ కాలువ ద్వారా కృష్ణా జలాలు మరో వారం రోజుల్లో చెన్నైకు రాబోతున్నాయని ప్రకటించారు. అలాగే, నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో లారీల ద్వారా తాగునీరు సరఫరా చేస్తూ వస్తున్నామని వివరించారు. అనంతరం విద్యుత్ శాఖ నిధుల కేటాయింపులపై సాగిన చర్చ వాడి వేడిగా సాగింది. మంత్రి నత్తం విశ్వనాథన్‌తో డీఎంకే సభ్యులు వాగ్యుద్దానికి దిగడంతో విమర్శలు, ఆరోపణలతో సభ సాగింది.