మహిళకేదీ భద్రత? | Assembly meetings in Tamil Nadu | Sakshi
Sakshi News home page

మహిళకేదీ భద్రత?

Published Mon, Jul 21 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

మహిళకేదీ భద్రత?

మహిళకేదీ భద్రత?

 సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై చర్చకు సీపీఎం, సీపీఐ, ఎంఎంకే, డీఎంకేలు పట్టుబట్టాయి. ప్రత్యేక వాయిదా తీర్మానం ఇచ్చాయి. దీంతో చర్చకు స్పీకర్ ధనపాల్ అనుమతించారు. సీపీఎం సభ్యుడు సౌందరరాజన్, సీపీఐ సభ్యుడు గుణ శేఖరన్, డీఎంకే సభ్యుడు చక్రపాణి, ఎంఎంకే సభ్యుడు అస్లాం బాషా ప్రసంగించారు. వీరి ప్రసంగాలకు మరి కాసేపట్లో మంత్రి వేలుమణి వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ సమయంలో డీఎంకే శాసన సభా పక్ష నేత ఎంకే స్టాలిన్ జోక్యం చేసుకుని మంత్రి వివరణ అనంతరం రాష్ట్రంలో మహిళా భద్రత, అత్యాచార పరంపరలపై చర్చకు అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశారు.
 
 వాకౌట్ : మహిళలపై లైంగిక దాడులు రోజురోజుకూ పేట్రేగుతున్నా, కట్టడి చేయరా.? అంటూ ప్రభుత్వాన్ని నిలదీయడానికి స్ట్టాలిన్ యత్నించారు. చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అయితే, స్పీకర్ ధనపాల్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. చర్చకు అనుమతి ఇవ్వాల్సిందేనని నినాదాలతో హోరెత్తించినా, స్పీకర్ తగ్గలేదు. దీంతో సభ నుంచి వాకౌట్ చేశారు. వెలుపల మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ర్టంలో మహిళలకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర గణాంకాలను బట్టి చూస్తే, ప్రతి ఏటా రాష్ట్రంలో మహిళలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 11 -18 ఏళ్ల లోపు వారు 250, 18-30 ఏళ్ల లోపు వారు 395, 30-50 ఏళ్ల లోపు వారు 93, 50 ఏళ్లు పైబడ్డ వాళ్లు 14 మంది గత ఏడాది లైంగిక దాడులకు గురైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. 2012లో కంటే, 13లో మహిళలపై దాడులు రాష్ట్రంలో పెరిగాయని, ఈ ఏడాది ఆరు నెలల వ్యవధిలో మరెన్నో దారుణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తాము పట్టుబడితే స్పీకర్ నిరాకరించారని విమర్శించారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామన్నారు.
 
 తాగునీటికి భరోసా : డీఎంకే వాకౌట్ అనంతరం తాగునీటి ఎద్దడిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజలకు ప్రభుత్వ భరోసాను వివరిస్తూ మంత్రి వేలుమణి ప్రసంగించారు. గత ఏడాది ఈరోడ్, కన్యాకుమారి, తిరునల్వేలి, తదితర 11 జిల్లాల్లో మాత్రం ఆశించిన మేరకు వర్షాలు పడ్డాయని వివరించారు. 20 జిల్లాల్లో పూర్తిగా వర్షాలు ముఖం చాటేశాయని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ముందస్తుగా తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చకుండా తాము చర్యలు తీసుకున్నామని వివరించారు. రూ.651 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకాల ద్వారా రోజుకు 1442 మిలియన్ లీటర్ల నీరు దక్కుతోందని పేర్కొన్నారు.
 
 అన్ని జిల్లాల్లో తాగునీటి సమస్య పరిష్కార లక్ష్యంగా చేపట్టిన అన్ని పనులు ఈ నెలాఖరులోపు ముగియనున్నాయని వివరించారు. చెన్నైకు తాగు నీటి ఎద్దడి రానివ్వకుండా చర్యలు చేపట్టామన్నారు. తెలుగు గంగ కాలువ ద్వారా కృష్ణా జలాలు మరో వారం రోజుల్లో చెన్నైకు రాబోతున్నాయని ప్రకటించారు. అలాగే, నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో లారీల ద్వారా తాగునీరు సరఫరా చేస్తూ వస్తున్నామని వివరించారు. అనంతరం విద్యుత్ శాఖ నిధుల కేటాయింపులపై సాగిన చర్చ వాడి వేడిగా సాగింది. మంత్రి నత్తం విశ్వనాథన్‌తో డీఎంకే సభ్యులు వాగ్యుద్దానికి దిగడంతో విమర్శలు, ఆరోపణలతో సభ సాగింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement