కసరత్తుల్లో ‘అమ్మ’
కేవలం మేనిఫెస్టోకు పరిమితం
జాబితా కసరత్తుల్లో ‘అమ్మ’
చెన్నై: అన్నాడీఎంకేలో ఐదుగురు నేతలపై అధినేత్రి, సీఎం జె.జయలలిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుంది. ఇన్నాళ్లు ఆ ఐదుగురికి ప్రత్యేక హోదా కల్పించగా, ప్రస్తుతం సీను మారినట్టుంది. ఇక వారికి చెక్ పెట్టినట్టేనా అన్న ప్రశ్న బయల్దేరింది. ఇందుకు అద్దం పట్టే విధంగా అన్నాడీఎంకేలో తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకేలో గానీయండి, ప్రభుత్వ వ్యవహారాల్లో గానీయండి ఐదుగురు మంత్రులకు సీఎం, అధినేత్రి జయలలిత ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎవ్వరు చిన్న తప్పు చేసినా, వారికి ఉద్వాసనే. ఆ దిశగా ఇటీవలి కాలంగా మంత్రులు పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళని స్వామి, పళనియప్పన్‌లకు ఆ ప్రాధాన్యత ఉంటూ వస్తోంది. ఈ ఐదుగురితో చర్చించిన అనంతరం నిర్ణయాలు తీసుకుంటున్నారు జయ. అలాగే, సీఎం వెంట ఈ ఐదుగురు తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కసరత్తుల వేగం పెరిగే కొద్ది ఈ ఐదుగురిపై ఆరోపణలు బయలు దేరుతూ వస్తున్నాయి. సీట్ల పేరిట సాగించి ఉన్న బండారాలు కొన్ని మీడియాల్లో కథనాల రూపంలో వెలువడుతూ వస్తున్నాయి.
ఇందులో ఏ మేరకు వాస్తవాలు ఉన్నాయో ఏమోగానీ, చిన్న పాటి ఆరోపణలు వస్తే చాలు కన్నెర్ర చేసే జయలలిత, ఈ ఐదుగురిపై అదే ధోరణి అనుసరించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ఆ ఐదుగురి మద్దతుదారులకు ఉద్వాసనల పర్వం సాగిస్తూ వస్తున్నారు. ఇక, ఈ ఐదుగురి లేనిదే సమీక్షలు, సమావేశాలు, సమాలోచనలు జరిగేవి కాదు.
అయితే, ఇప్పుడు ఆ ఐదుగుర్ని జయలలిత పక్కన పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే, వీరితో పాటుగా మరో 14 మంది ఎన్నికల మేనిఫెస్టో తయారీ కమిటీలో ఉండడంతో, ఇప్పటికిప్పుడే వారికి చెక్ పెట్టకుండా, మేనిఫెస్టో పూర్తికా గానే, కన్నెర్ర చేయడానికి సీఎం జయలలిత నిర్ణయించి ఉన్నట్టుగా సమాచారాలు వెలువడుతుండడం గమనార్హం. ఇందుకు అద్దం పట్టే రీతిలో అభ్యర్థుల ఇంటర్వ్యూల పర్వాన్ని సాగించి ఉన్నారు.
ఐదుగురికి బదులుగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, మైనారిటీ విభాగం నాయకులు తమిళ్ మగన్ హుస్సేన్, సెల్వ రాజ్‌లకు తన ముందు కూర్చునే అవకాశాన్ని జయలలిత కల్పించి ఉండడం గమనించాల్సిన విషయం. అలాగే అమ్మను కలిసేందుకు ప్రయత్నించిన ఆ ఐదుగురికే కాదు, ఆ కమిటీలో ఉన్న మిగిలిన 14 మందికి సైతం పోయేస్ గార్డెన్‌లోకి అనుమతి లభించక పోవడం గమనార్హం.
బయటి నుంచి ఫోన్లో అమ్మతో మాట్లాడి వెనుదిరగాల్సిన పరిస్థితి ఐదుగురికి ఏర్పడి ఉండడంతో, తదుపరి అమ్మ అడుగు ఎలా ఉండబోతోందోనన్న ఉత్కంఠ అన్నాడీఎంకేలో బయలు దేరి ఉన్నది. అలాగే, అభ్యర్థుల జాబితా పూర్తి ప్రక్రియ అమ్మ కనుసన్నలోనే జరుగుతుండడం గమనార్హం. వంద మంది అభ్యర్థులతో తొలి జాబితాను ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేసి ఉన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఇందులో 90 మంది కొత్త ముఖాలుగా సమాచారాలు వస్తుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల్లోనూ గుబులు బయలు దేరి ఉన్నది.