అన్నీ మీ కోసమే... | AIADMK manifesto released | Sakshi
Sakshi News home page

అన్నీ మీ కోసమే...

Published Sat, May 7 2016 2:57 AM | Last Updated on Wed, Sep 5 2018 3:24 PM

అన్నీ మీ కోసమే... - Sakshi

అన్నీ మీ కోసమే...

అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
పెరుందురైలో జయలలిత ఎన్నికల వాగ్దానం

 
సాక్షి, చెన్నై: అందరూ ఎదురు చూస్తున్న ‘అమ్మ’ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమం, జాలర్లు, అన్నదాతల అభ్యున్నతి, యువతీ, యువకులకు వరాలు, ఉద్యోగులకు కానుక , విద్యార్థులకు భవిత అందిస్తూ, ప్రస్తుత పథకాలన్నీ విస్తృతం చేయడం లక్ష్యంగా ఎన్నికల వాగ్దానాల్ని అమ్మ జయలలిత ప్రకటించారు. గురువారం ఈరోడ్ జిల్లా పెరుందురైలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మేనిఫెస్టోను ప్రకటించారు.  మళ్లీ అధికారం లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఎన్నికల్లో పరుగులు తీస్తున్నారు. మిత్రులతో కలిసి 234 స్థానాల్లో రెండాకుల చిహ్నం మీద అభ్యర్థులను బరిలో దించారు. అందరికన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన జయలలిత మేనిఫెస్టోను మాత్రం అందరికన్నా ఆలస్యంగా విడుదల చేశారు.

దీంతో అమ్మ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయో అన్న ఎదురు చూపులు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే కొత్త, పాత అంశాలను, పథకాలను, ఇతర పార్టీలు కూడా చేసిన కొన్ని వాగ్దానాలను క్రోడీకరించి సరికొత్తగా అన్నీ మీకోసం అన్న నినాదంతో మేనిఫెస్టోను ప్రకటించారు. ఇందులో కొన్ని ఆసక్తికరంగా ఉండడం, మరికొన్ని కొందరికే అన్నట్టుగా ఉండడం వెరసి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చామంటూ ‘అమ్మ’ ఎన్నికల వాగ్దానాల జాబితాలోని అంశాలను పెరుందురై వేదికగా వివరించారు. అన్నీ మీకోసం.. అంటూ,  చెప్పింది చేశాం..చెప్పనిదీ చేశాం...ఇంతే కాదు... మరెంతో, మరెన్నో పథకాలు అధికారం అప్పగిస్తే అమలు చేసి తీరుతానని హామీ ఇచ్చారు.
 
మేనిఫెస్టోలో ముఖ్యవైనవి కొన్ని..
దశల వారీగా మద్య నిషేధం. తొలుత దుకాణాల సంఖ్య తగ్గింపు, పని వేళల తగ్గింపు. బార్ల మూసి వేతకు చర్యలు. మద్యం బానిసలకు పునరాస కేంద్రాలు

రైతు రుణాలన్నీ రద్దు, కొత్త రుణాల పంపిణీకి చర్యలు, అన్నదాతకు భద్రత లక్ష్యంగా చర్యలు
సహకార చక్కెర పరిశ్రమలు రైతులకు అందించాల్సిన బకాయిల పంపిణీకి చర్యలు
కొబ్బరి ధర తగ్గినప్పుడు, మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు
అత్తి కడవు-అవినాశి పథకం అమలు
రిజిస్ట్రేషన్లు సులభతరం
నిషేధ కాలంలో జాలర్లకు రూ. ఐదు వేల సాయం. జాలర్ల కోసం ప్రత్యేక గృహ నిర్మాణ పథకం, యంత్రాలతో నడిచే పడవల కొనుగోలుకు రాయితీలు
కొత్తగా రోడ్లు, వంతెనల నిర్మాణాలు, విస్తరణ, పునరుద్ధరణ
ధరల పెరుగుదల కట్టడికి చర్యలు
ప్లస్ ఒన్, ప్లస్‌టూ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌తో పాటుగా ఇంటర్నెట్ సదుపాయం
మహిళా, శిశు సంరక్షణ  పథకాలన్నీ మరింతగా విస్తృతం
అమ్మ హెల్త్ చెకప్ విస్తృతం
గర్భిణులకు రూ. పన్నెండు వేల నుంచి రూ. 18 వేలకు ప్రసూతి సాయం పెంపు
అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు సీ విటమిన్ మాత్రలు
కోతల రహితంగా విద్యుత్ సరఫరా. వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. 78 లక్షల విద్యుత్ వినియోగ దారులకు వర్తింపు
విద్యార్థుల రుణాలన్నీ రద్దు
జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు
అంబేడ్కర్ ఆశయ సాధనకు రూ. ఐదు కోట్లతో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఏర్పాటు
చిరు వర్తకులకు తక్కువ వడ్డీతో రుణాలు, మైనారిటీల అభివృద్ధికి ప్రత్యేక రుణాలు, ఉలామాక్కల్ కు ఫించన్ రూ. వెయ్యి నుంచి రూ. పదిహేను వందలకు పెంపు.
నేత కార్మికులకు కేటగిరి వారిగా 200, 750 యూనిట్లు వరకు  ఉచిత విద్యుత్, నేత కార్మికుల ఇళ్ల నిర్మాణాల కొనసాగింపు
కుటుంబ కార్డు దారులకు  సంక్రాంతి కానుకగా కో ఆప్‌టెక్స్ ద్వారా వస్త్రాల కొనుగోలుకు రూ. ఐదువందలు గిఫ్ట్ కూపన్
మట్టి పాత్రల తయారీ కార్మికులు, ఉప్పు తయారీ కార్మికులకు వర్షాకాలంలో రూ. ఐదువేలు చొప్పున సాయం
సీఎం గ్రీన్‌హౌస్ పథకం కింద పది లక్షల ఇళ్ల నిర్మాణం
సీనియర్ సిటిజన్లకు ఉచిత పయనం సేవలు విస్తృతం
ఆలయాల పునరుద్ధరణకు సహాయం రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంపు, క్రైస్తవ ఆలయాల పునరుద్దరణ, మరమ్మతులకు ప్రత్యేక రాయితీ, మసీదుల మరమ్మత్తులకు ప్రత్యేక నిధి
కేబుల్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ఖర్చుతో టీవీ ప్రసారాలు, సెట్‌టాప్ బాక్సుల ఉచితం
ప్రధాన ప్రాంతాలు బస్టాండ్, పార్కులు, జన సంచారం అధికంగా ఉండే చోట్ల ఉచిత  వైఫై సేవలు
 
 రేషన్‌కార్డుదారులకు ఉచిత సెల్‌ఫోన్
ఎనిమిది గ్రాముల బంగారు
విటమిన్ డీ, ఏ తో కూడిన ఆవిన్ పాలు లీటరు రూ. 25కు పంపిణీ
ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం వేళల్లో అల్పాహారం
కొత్తగా మహిళా స్వయం సహాయక బృందాల ఏర్పాటు, ప్రత్యేక శిక్షణ, సహకారం. మహిళలు ఆటో డ్రైవింగ్ శిక్షణ. ఆటోల కొనుగోలుకు రాయితీలు
అన్ని నగరాలు, మహానగరాలు, పట్టణాలకు మినరల్ వాటర్
చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అమ్మ గ్యారంటీ ఫండ్‌కు రూ. వంద కోట్లు కేటాయింపు. ప్రత్యేకంగా రుణాల పంపిణీ
సరికొత్త ప్రయత్నాలతో పరిశ్రమల్ని నెలకొల్పే వారిని దృష్టిలో ఉంచుకుని అమ్మ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు, రూ. ఐదు వందల కోట్లు కేటాయింపు. గ్రామాల్లో చిన్న తరహా పరిశ్రమల్ని నెలకొల్పేందుకు రుణాలు
తేయాకు రైతుల్ని ఆదుకునేందుకు రుణాలు
అవినీతి నిర్మూలన లక్ష్యంగా లోకాయుక్తా ఏర్పాటు
ప్రభుత్వ ఆదాయం పెంపునకు కొత్త గ్రానైట్ విధానం, దాతు ఇసుక, ఇసుక విక్రయాలన్నీ ప్రభుత్వ గుప్పెట్లోకి
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతన కమిషన్. పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు తొమ్మిది నెలలకు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల నిర్మాణం కోసం ముందస్తుగా రూ. 40 లక్షల వరకు సాయం
యువతీ, యువకులకు వృత్తి శిక్షణ, స్వయం ఉపాధికి చర్యలు, ఉపాధి అవకాశాల మెరుగు
పదిహేను లక్షల మంది కార్మికులకు ప్రత్యేక శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ
పది లక్షల మందికి వివిధ పరిశ్రమల్లో శిక్షణ, అక్కడే ఉద్యోగాల కేటాయింపునకు చర్యలు
అమ్మ ద్విచక్ర వాహన శిక్షణ  కేంద్రం ఏర్పాటు, ఉపాధికి అవకాశాలు
మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు యాభై శాతం రాయితీ
పేద, మధ్య తరగతి వారి కోసం అమ్మ బ్యాంకింగ్ కార్డులు, బ్యాంక్‌ల సహకారంతో పథకం అమలు
ప్రస్తుత అమ్మ పథకాలన్నీ కొనసాగింపు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ, ఇది వరకే ప్రభుత్వం ప్రకటించి, అమలు చేస్తున్న ప్రాజెక్టులు, పథకాలు, అన్నీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement