విస్తృత స్థాయి సమావేశంలో పన్నీర్ సెల్వం, ఎడపాడి పళని స్వామి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోకుండా చిన్నమ్మ శశికళకు చెక్‌పెట్టాలని, ఆమె సాగిస్తున్న రహస్య పన్నాగాలను తిప్పికొట్టాలని ఆ పార్టీ రథసారథులు ఓ పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈనెలాఖరులో పార్టీ జనరల్ బాడీ సమావేశం సన్నాహాల్లో భాగంగా చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో మంగళవారం విస్తృస్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఐదేళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత 2019లో ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరపాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రబలుతున్నందున అప్పట్లో ఎన్నిక లు నిర్వహించలేదు. 2021 ద్వితీయార్థంలో కరోనా కేసులు అదుపులోకి రావడంతో అదే ఏడాది డిసెంబర్‌లో పార్టీ నిర్వాహకులు, ఈ ఏడాది ఏప్రిల్‌లో పార్టీ పదవులకు ఎన్నికలు ముగించారు. ఈ పదవులను జనరల్‌బాడీ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది. ఇందుకోసం ఈనెల 23వ తేదీన జనరల్‌బాడీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి జిల్లా కార్యదర్శులకు, ఉప కార్యదర్శులకు, కార్యవర్గ నిర్వాహకులకు ఇంత వరకు ఆహ్వానాలు అందలేదు.
ప్రత్యేక ఆహ్వానితులను సైతం జనరల్ బాడీ సమావేశంలో భాగస్వాములను చేయాలని పన్నీర్‌సెల్వం ఒత్తిడి చేస్తుండగా, ఎడపాడి ఇందుకు అంగీకరించలేదు. జనరల్ బాడీ సమావేశానికి శశికళ మద్దతుదారులు, నకిలీ సభ్యులు హాజరై గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఎడపాడి అనుమానించడం వల్లనే అంగీకరించడం లేదనే వాదన ఉంది. ఏదో విధంగా పార్టీలోకి జొరబడేందుకు శశికళ చేస్తున్న ప్రయత్నాలను గట్టిగా అడ్డుకోవాని జిల్లా కార్యదర్శులను ఇప్పటికే ఎడపాడి ఆదేశించారు. బలమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలి, రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే వ్యూహం తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలను ఈ సమావేశంలో చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment