‘కత్తి’దూసిన హిరో విజయ్
► అన్నదాతను ఆదుకోండని ప్రభుత్వానికి హితవు
► విస్మరిస్తే అందరం బాధితులమేనని హెచ్చరిక
► కురువై సాగుబడికి రూ.57 కోట్లు: సీఎం
ఆందోళనలు, ఆత్మహత్యలతో అల్లాడుతున్న అన్నదాతల కోసం నటుడు విజయ్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వంపై సున్నితంగా చురకలు అంటిస్తూ సూచనలు చేశారు. మూడుపూటలా ముద్దకు కారణమైన రైతన్నను విస్మరించరాదని హితవు పలికారు. సమర్థతను పక్కనపెట్టి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకోవాలనే పదునైన మాటలతో ప్రభుత్వంపై ‘కత్తి’ దూశారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: రెండేళ్ల క్రితం అతివృష్టి, ఆ తరువాత అనావృష్టితో రాష్ట్రంలోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండిపోయిన పంటలు చూసి గుండాగిపోగా వందలాది మంది రైతులు ప్రాణాలు వదిలేశారు. పంటలు ఎండిపోయి, రుణభారం పెరిగి పోవడంతో ఆత్మహత్య శరణ్యమనే నిర్ణయానికి వచ్చేశారు. వ్యవసాయ రుణాలను రద్దు చేసి అన్నదాతలను ఆదుకోవాలని సుమారు రెండు నెలలపాటూ రైతులు పోరాటం చేస్తున్నారు. సుమారు 40 రోజులు ఢిల్లీలో అవిశ్రాంత ఆందోళన చేసిన రైతులు సీఎం హామీ మేరకు విరమించారు. అయితే సీఎం హామీ అమలుకు నోచుకోలేదని ఆగ్రహించిన అన్నదాతలు రెండు రోజుల క్రితం చెన్నైలో మళ్లీ పోరుబాట పట్టారు. రైతు ప్రతినిధులను సచివాలయానికి పిలిపించుకున్న సీఎం హామీలను నెరవేర్చేందుకు రెండు నెలల గడువు కోరడంతో తాత్కాలికంగా విరమించారు.
‘కత్తి’ని తలపించిన విజయ్
ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తీసిన ‘కత్తి’ చిత్రంలో నటుడు విజయ్ రైతు సమస్యలపై పోరాడే పాత్రలో నటించాడు. ప్రభుత్వంతోపాటూ ప్రజలు, మీడియాకు సైతం కనువిప్పు కలిగించేలా ఆ పాత్ర మలచబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరువుతాండవిస్తూ అన్నదాతలు అలమటిస్తుండగా విజయ్ కత్తి చిత్రంలోని పాత్రను గుర్తుకు తెస్తూ గళం విప్పి కలకలం రేపాడు. చెన్నైలో ఆదివారం రాత్రి జరిగిన ఒక ప్రయివేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమర్థవంతమైన ప్రభుత్వంగా మారడం తరువాత చూద్దాం, ముందు అన్నదాతల పాలిట మంచి ప్రభుత్వంగా మారేందుకు ప్రయత్నించాలని సూచించారు.
బియ్యాన్ని ఉత్పత్తి చేసే రైతన్నలు ఉచిత బియ్యం కోసం రేషన్ దుకాణాల వద్ద దీనంగా క్యూలో నిలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనం బాగానే ఉన్నాం, కానీ మనకు అన్నంపెట్టే అన్నదాతల జీవితాలే బాధాకరంగా మారిపోయయని అన్నారు. రైతన్నల బాగుచూడడం ప్రజలందరి కర్తవ్యమని, ఈ సత్యాన్ని విస్మరిస్తే అందరం బాధితులుగా మారిపోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే కల్తీ ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం, అనారోగ్యకరమైన ఆహారాన్నే భుజిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం దెబ్బతినడమే ఇందుకు కారణమని అన్నారు.
మూడుపూటలా భోజనం తినడంతో రైతుల బాధలు ప్రజలకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు అత్యవసరంగా తీర్చాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై కమల్‌హాసన్, రజనీకాంత్‌లు ఇటీవల అనేకసార్లు విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు వారిద్దరూ బాట వేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. నేడు తాజాగా అగ్రహీరోల తరహాలో విజయ్ సైతం రైతు ప్రయోజనాల కోసం ఘాటైన విమర్శలు చేయడం సంచలనమైంది.
డెల్టా రైతులకు రూ.57 కోట్లు
ఆదివారం రాత్రి నటుడు విజయ్ చేసిన విమర్శలకు స్పందించినట్లుగా డెల్టా రైతులకు సీఎం వరాలను ప్రకటించారు. కురువై సాగుబడికి రూ.56.92 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి సోమవారం ప్రకటించారు. డెల్టా జిల్లాల్లో కురువై సాగుబడిపై ఇటీవల సచివాలయంలో అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం, కర్ణాటక నుంచి రావాల్సిన కావేరి నీరు అంశాలను చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతంలో ఉన్న నీటి వనరులతో కురువై సాగుబడిని ఎలా నెట్టుకు రావాలో అధికారుల నుంచి సూచనలను తీసుకున్నట్లు చెప్పారు. 3.15 లక్షల ఎకరాల్లోని రైతులు లబ్ధి పొందేలా నిధులను పంపిణీ చేయనున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.