
భిక్షమెత్తుకుంటున్న కళాకారిణికి విశాల్ ఆపన్నహస్తం
ఒకప్పుడు నృత్య కళాకారిణిగా వెలిగిన జమున ప్రస్తుతం పేదరికంలో ఆర్థిక ఇబ్బందులతో స్థానిక వడపళణిలోని కుమారస్వామి ఆలయం ముందు భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. ఈమె అప్పట్లో ప్రఖ్యాత నటీమణి సరోజా దేవి, భానుమతి వంటి వారితో పలు చిత్రాల్లో నృత్యం చేశారు. అదే విధంగా కర్ణన్, తోళవయ్యార్ వంటి ఉత్తమ చిత్రాల్లో నటించారు. అదే విధంగా శివాజీగణేశన్, ఎంజీఆర్, శివకుమార్ వంటి నటులతో కలసి నటించారు.
ఆమె భర్త మేకప్ కళాకారుడు. భర్త మృతిచెందడం, బిడ్డలు లేకపోవడం, ఆర్థికిబ్బందులతో కొన్ని రోజుల కిందట జమున వడపళనిలో కుమారస్వామి ఆలయం ముందు భిక్షాటన చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న విశాల్ వెంటనే తన కార్య నిర్వాహకుడు మురుగదాస్, తన అభిమాన సంఘం సభ్యుడు హరికృష్ణన్‌ను జమున వద్దకు పంపి ఆమెకు సాయం చేయాల్సిందిగా సూచించారు. దీంతో వారు జమునను కలిసి అనాథాశ్రమానికి పంపిస్తామని తెలపగా అందుకు ఆమె నిరాకరించింది. తనకు నెలకు కొంత పైకాన్ని అందించేలా చూడాలని కోరింది. ఈ విషయం విశాల్‌కు చెప్పగా ఆయన తన దేవి ట్రస్ట్ నుంచి నెలకు రూ.2వేలు అందించేలా ఏర్పాటు చేశారు.