
నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు
నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటోంది నిక్కికల్ రాణి. ఈ కన్నడ భామ కోలీవుడ్‌లో పరిచయమైన చిత్రం డార్లింగ్. తొలి చిత్రంతోనే తమిళ సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న జాణ ఈమె. కన్నడ నటి సంజనకు సోదరి అయిన ఈ సుందరితో మినీ ఇంటర్వ్యూ.
ప్ర: చిత్ర రంగ ప్రవేశం ఎలాజరిగింది?
జ: ఇంట్లో వాళ్లకేమో నేను డాక్టర్ కావాలని ఆశ. నేను అయితే, ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేశాను. ఆ తర్వాత మోడలింగ్‌పై దృష్టి పెట్టాను. ఇప్పుడు నటి అయ్యాను. దీన్ని బట్టి చూస్తే, ఏదీ మన చేతుల్లో లేదని అర్థం అవుతుంది.
ప్ర: మీ అక్క సంజన ఎలాంటి సూచనలు ఇస్తుంటారు?
జ: అక్క బిజీ ఆర్టిస్టు. అయినా, నేను నటిని కావడం ఆమెకు సంతోషం. మేకప్, కాస్ట్యూమ్స్ లాంటి విషయాల్లో సలహాలు ఇస్తుంటుంది. షూటింగ్ స్పాట్‌లో ఎలా నడుచుకోవాలో అన్నదానిపై సూచనలు ఇస్తుంటుంది.
ప్ర: డార్లింగ్ చిత్రంలో నటిగా అనుభవం?
జ: చాలా సరికొత్త అనుభవం. ఒక భూత్ బంగ్లాలో దారుణంగా హత్యకు గురైన యువతి దెయ్యంగా మారి నాలో ప్రవేశిస్తుంది. దీంతో జీవీ ప్రకాష్ కుమార్ ప్రేయసిగా, ఒక విధమైన హాస్యభరిత నటనతో దెయ్యం పట్టిన మనిషిగా నటన ప్రదర్శించడం సవాల్‌గా మారింది. రెండు విభిన్న కోణాల్లో సాగిన ఈ పాత్రల్ని చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. ఈ చిత్రంలో నా నటనకు తమిళ ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ లభించడం ఆనందంగా ఉంది.
ప్ర: దక్షిణాది భాషలన్నింటిలో నటిస్తున్నారటా?
జ: మలయాళంలో దిలీప్‌తో ఇవన్ మర్యాద రామన్, వినిత్ శ్రీనివాస్ సరసన ఒరు సెండ్ క్లాస్ యాత్ర, సురేష్ గోపికి జంటగా రుద్రసింహాసనం చిత్రాల్లో, కన్నడంలో సిద్దార్థ అనే ఒక చిత్రంలో, తెలుగులో సునీల్‌కు జంటగా మలుపు అనే చిత్రంలో నటిస్తున్నాను.
ప్ర: బాలీవుడ్ ఆశ మరీ?
జ: అన్ని భాషల్లో నటించాలని ఉంది. అయితే, అన్నీ సక్రమంగా అమరాలిగా. ముందు ఇక్కడ పేరు సంపాదించుకోవాలి. ఆ తర్వాత బాలీవుడ్ ఆశిస్తాను.
ప్ర: దక్షిణాదిలో నాలుగు భాషల్లో నటిస్తున్నారు..వీటిలో ఏ భాష సౌకర్యంగా ఉంది?
జ: భాషలు వేరైనా నటన ఒక్కటే. పాత్రను అందులోని భావాలను అర్థం చేసుకుంటే, ఏ భాషలోనైనా నటించడం సౌకర్యంగా ఉంటుంది. నాకు తెలిసిన భాషలో సంభాషణ రాసుకుని, పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని హావభావాలు వ్యక్తం చేస్తూ నటిస్తాను.
ప్ర: గామర్ విషయంలో మీ భావన?
జ: నాలో నటనా ప్రతిభ ఉంది. మొదట దానిని బహిర్గతం చేయాలని ఆశ పడుతున్నాను. అలాగని, నేను గ్లామర్‌కు వ్యతిరేకిని కాను. అయితే, నటనకు అవకాశం ఉన్న పాత్రనే ప్రేక్షకుల మనస్సుల్లో చిరకాలం నిలిచి పోతాయన్నది నా అభిప్రాయం. గౌరవాన్ని కాపాడుకునే పాత్రలు చేయాలని కోరుకుంటున్నా.
ప్ర: బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా..?
జ: ఒకడు ఉన్నాడు. అతడి పేరు సినిమా. అవును నేను ఇప్పుడు సినిమాలను మాత్రమే ప్రేమిస్తున్నాను. నటిగా ఇప్పుడే అడుగులు వేయడం ఆరంభించాను. అప్పుడే బాయ్ ఫ్రెండ్ ఏమిటి. ఇప్పటి నుంచే ప్రేమ గురించి ఆలోచిస్తుంటే, కెరీర్ దెబ్బ తింటుంది. అందువల్ల ప్రస్తుతం నా దృష్టి అంతా నటనను ప్రేమించడమే.