
పెరంబూరు: నటి రేవతిపై ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే కేరళ రాష్ట్రం, కొచ్చికి చెందిన సియాజ్ జమాస్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఎర్నాకులం క్రైం పోలీసులకు రేవతిపై ఫిర్యాదు చేశారు. అందులో కొన్ని ఏళ్ల క్రితం షూటింగ్‌లో ఒక 17 ఏళ్ల బాలికపై ఎవరో అత్యాచారయత్నం చేసినట్లు నటి రేవతి చెప్పారన్నారు. అయితే ఆ బాధితు రాలు ఎవరన్నది రేవతి బయట పెట్టకుండా దాచారని ఆరోపించాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని, లైంగిక వేధింపులకు గురైన ఆ నటి ఎవరన్నది చెప్పకుండా దాచిపెట్టిన నటి రేవతిపైనా కేసు నమోదు చేయాలని పేర్కొన్నాడు.
కాగా ఈ ఫిర్యాదుపై స్పందించిన నటి రేవతి 17 ఏళ్ల నటి అర్ధరాత్రి తాను బస చేసిన హోటల్ గది తలుపు తట్టి భయంతో కాపాడండి అంటూ కేకలు వేసింది నిజమేనన్నారు. అయితే ఆ బాలికపై అత్యాచారయత్నం జరిగినట్లు తాను చెప్పలేదని అన్నారు. అర్ధరాత్రి ఎవరో తన గది తలుపులు తట్టడంతో ఆ బాలిక, బామ్మ భయంతో తన గదికి వచ్చారని ఆ రాత్రి తాము ముగ్గురం నిద్రలేకుండా గడిపినట్లు తెలిపారు. వృతి రీత్యా వచ్చిన మహిళలకు రక్షణ కల్పించాలనే తాను ఆ సంఘటన గురించి చెప్పానని నటి రేవతి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment