వదంతులకు చెక్
సచివాలయంలో సీఎం సందడి
పథకాలు ప్రారంభించిన జయలలిత
పీఎంకు సీఎం లేఖ
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత ఈనెల 4వ తేదీన అమ్మ సచివాలయానికి వచ్చారు. ఆ తరువాత అనేక కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉండగా, రద్దు చేసుకున్నారు. దీంతో రాజకీయ పార్టీల నేతలు ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానాలు చేయసాగారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నందునే జయ బైటకు రావడం లేదని ప్రచారం జరిగింది. ఈ దశలో బుధవారం మధ్యాహ్నం 1.10 గంటలకు జయలలిత సచివాలయానికి వచ్చారు. మంత్రులు ఆమెకు ఘనస్వాగతం పలికి లోనికి ఆహ్వానించారు. నేరుగా సీఎం చాంబర్‌కు వెళ్లిపోయారు.
తమిళనాడు ఎగ్జామినేషన్ బోర్డు ద్వారా సైన్స్, ఆర్ట్స్ విభాగ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అసిస్టెంటు ప్రొఫెసర్లుగా నియామక ఉత్తర్వులను జయ స్వయంగా అందజేశారు. పేదలు, విద్యార్థులకు ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. తిరువన్నామలై జిల్లా సెంగంలో 39.52 ఎకరాల విస్తీర్ణంలో రూ.72.60 కోట్లతో నిర్మించిన పాల పౌడర్ ఫ్యాక్టరీని, రూ.4.12 కోట్లతో రాష్ట్రం నలుమూలలా ఏర్పాటు చేసిన 151 ఈ-సేవాకేంద్రాలను విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్రం ప్రవేశపెట్టిన నిర్బంధ వ్యవసాయ భూముల సేకరణ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రధాని నరేంద్రమోదీకి జయ లేఖ రాశారు. రైతుల సంక్షేమాన్ని దెబ్బతీసే ఈ బిల్లును ఎంతమాత్రం అంగీకరించబోమని లేఖలో ఆమె స్పష్టం చేశారు.