సాక్షి, న్యూఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తుండడంతో రాజధానిలో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతోపాటు ఢిల్లీ రాజకీయ భవితవ్యంపై నాయకులతోపాటు రాజకీయ పండితులు, సామాన్యుల్లో చర్చ మొదలైంది. శాసనసభ ఎన్నికల నాటితో పోలిస్తే ఢిల్లీ రాజకీయాలు మారిపోయాయి. మూడు ప్రధాన పార్టీల తరపున ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పోటీచేసిన షీలాదీక్షిత్, అర్వింద్ కేజ్రీవాల్, హర్షవర్ధన్ స్థానిక రాజకీయాల నుంచి నిష్ర్కమించారు. షీలాదీక్షిత్ కేరళ గవర్నర్ పదవీ బాధ్యతలు చేపట్టగా, అర్వింద్ కేజ్రీవాల్, హర్షవర్థన్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి జాతీయ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హర్షవర్ధన్‌తోపాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రవేశ్‌వర్మ, రమేష్ బిధూరీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.
నెలరోజుల క్రితం పోలింగ్ తర్వాత చల్లబడిన ఢిల్లీ రాజకీయాలు లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మళ్లీ ఊపందుకోనున్నాయి. ఢిల్లీ శాసనసభను రద్దు చేసి తాజాగా ఎన్నికలు జరిపించాలనే డిమాండ్ గట్టిగా వినపడనుంది. ఇప్పటికే ఈ డిమాండ్ వినిపిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ మే 16 త రువాత తన స్వరాన్ని పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సుముఖంగా లేమంటోన్న బీజేపీకూడా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వస్తే శాసనసభ ఎన్నికల అంశాన్ని లేవనెత్తే అవకాశముంది. ఇలా జరిగితే మూడు పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఎవరిని ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది. ముఖ్యమ ంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటిండం కాంగ్రెస్ ఆనవాయితీ కాదని, అదీకాకుండా ఆ పార్టీకి ప్రస్తుతం ఢిల్లీలో విజయావకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, అందువల్ల ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయానికి ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం లేదని రాజకీయ పండితులు అంటున్నారు.
వారణాసి నుంచి నరేంద్రమోడీ గెలిచే అవకాశాలు నూటికి నూరు శాతం కనిపిస్తున్నాయని, అందువల్ల కేజ్రీవాల్ మళ్లీ ఢిల్లీ రాజకీయాలకు రావొచ్చని అంటున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారిస్తే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని, లేనట్టయితే మనీష్ సిసోడియాకు అవకాశం లభించొచ్చని ఊహిస్తున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మళ్లీ హర్షవర్ధన్‌నే ప్రకటించొచ్చని అంటున్నారు. ఒకవేళ హర్షవర్ధన్ విజయం సాధిస్తే ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని ఆశించిన విజయ్ గోయల్‌ను శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలోనే అధ్యక్ష పదవినుంచి తప్పించి హర్షవర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే ఆ తరువాత ఆయనను చాందినీచౌక్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో దించారు. ఒకవేళ. హర్షవర్ధన్ ఎంపీగా గెలిస్తే ఆయన జాతీయ రాజకీయాలకు పరిమితమవుతారు. విజయ్ గోయల్ ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించొచ్చనే అంశంపై చర్చ జోరుగా జరుగుతోంది. ఈ అవకాశం ఆ పార్టీ సీనియర్ నేత జగ్‌దీశ్ ముఖికి దక్కవచ్చని కొందరు అంటున్నారు. ఆయన వరుసగా ఐదోసారి శాసనసభకు ఎన్నికయ్యారని, ఢిల్లీ బీజేపీ నేతలందరిలోకి అనుభవజ్ఞుడని వారంటున్నారు. సీనియర్ నేతకు కాకుండా యువనేతకు అవకాశమివ్వొచ్చని మరికొందరు అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ బాగా బలహీనపడిన నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు జరిగినట్లయితే పోటీ ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్యనే ఉంటుందని, ఈ నేపథ్యంలో యువతను ఆకట్టుకోగల యువ నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మరికొందరు అంటున్నారు.
మళ్లీ రాజకీయ వేడి
Published Sat, May 10 2014 10:45 PM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM
Advertisement