కోయంబత్తూరులో రెండురోజుల క్రితం పట్టుబడిన ఐదుగురు మావోల్లో ఒకరైన రూపేష్ పోలీసులనుద్దేశించి
పట్టుబడిన మావో రూపేష్ వెల్లడి
కొండ ప్రాంతాల్లో అలర్ట్
కోవైలో మావోల కుమార్తెలు
కోయంబత్తూరులో రెండురోజుల క్రితం పట్టుబడిన ఐదుగురు మావోల్లో ఒకరైన రూపేష్ పోలీసులనుద్దేశించి పలు హెచ్చరికలు చేయడం కలకలం సృష్టించింది. తమను అరెస్ట్ చేసినంత మాత్రాన తమిళనాడులో దాడులను ఆపలేరని రూపేష్ చేసిన వ్యాఖ్యలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో దాడులు చేసేందుకు సిద్ధం అవుతున్న రూపేష్, ఆయన భార్య సైనా, అనూప్, కన్నన్, వీరమణి అనే ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి పాఠకులకు విదితమే. తమిళనాడు, కేరళ సరిహద్దు రాష్ట్రాల్లో శిక్షణ పొందుతున్న 40 మంది మావోయిస్టుల వల్ల దాడుల తథ్యమని పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో రూపేష్ పేర్కొన్నట్లు తెలిసింది. శిక్షణ పొందుతున్న వారిలో పది మంది తమిళనాడుకు చెందిన వారని రూపేష్ వెల్లడించాడు. పడమర కొండల్లో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను తమ వారు సాధించి తీరుతారనే నమ్మకం తనకు ఉందని అతను పేర్కొన్నాడు.
ఈ మావోలకు ధర్మపురి జిల్లాకు చెందిన కాళిదాస్ అనే వ్యక్తి శిక్షణ నిస్తున్నట్లు భావిస్తున్నారు. ఆయుధ శిక్షణ ఇవ్వడంలో సిద్ధహస్తుడైన కాళిదాస్ కోసం పదేళ్లుగా పోలీసులు గాలిస్తున్నా పట్టుబడలేదు. గతంలో తమిళనాడు పోలీసులకు కొందరు మావోలు పట్టుబడగా వీరికి సైతం కాళిదాస్ శిక్షణ నిచ్చినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు అతని కోసం గాలింపు తీవ్రం చేశారు. మావోలు ప్రతిదాడులకు పాల్పడే అవకాశం ఉందన్న అనుమానంతో నీలగిరి జిల్లా కొండప్రాంత సరిహద్దులోని సేరంబుడి, ఏరుమాడు, కేళనాడుకని, దేవాల, మసినకుట్టి, మీంజూరు, సొల్లూరు మఠం తదితర పోలీస్‌స్టేషన్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టుబడిన ఐదుగురు మావోలకు కోవై కోర్టు జూన్ 3 వరకు రిమాండ్ విధించింది. దక్షిణాది మావోదళాధిపతైన రూపేష్‌తోపాటూ మరో నలుగురిని కోవై సెంట్రల్ జైలులో ఉంచారు. అగ్రనేతలు పట్టుబడిన కారణంగా కోవై జైలుకు మూడండెల అదనపు భద్రత ఏర్పాటు చేశారు. మావోలందరినీ పోలీస్ క స్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని కుట్రలు వెలుగుచూస్తాయని భావిస్తున్న పోలీసులు గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
కోవై జైలు వద్ద రూపేష్,సైనా కుమార్తెలు
ఇదిలా ఉండగా, తమ తల్లిదండ్రులు పోలీసులకు పట్టుబడిన సమాచారం తెలుసుకున్న రూపేష్, సైనాల కుమార్తెలు ఆమీ (18),తాజు (13) బుధవారం కోవై జైలు వద్దకు చేరుకున్నారు. వారితోపాటూ ఒక బంధువును తోడుగా తెచ్చుకున్నారు. తల్లిదండ్రులను చూసేందుకు అనుమతించాలని పోలీసులను లిఖితపూర్వకంగా కోరారు. కేవలం పది నిమిషాలకు పోలీసులు అనుమతించారు. వారి వద్ద కెమెరా ఉండడంతో దానిని స్వాధీనం చేసుకుని తిరిగి వెళ్లే ముందు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆమీ మీడియాతో మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు ఏమీ నేరం చేయలేదు, ఇతర ఆస్తులను దోచుకోలేదు, కేవలం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్యమించారని అన్నారు. చట్టపరంగా తమ తల్లిదండ్రులను కాపాడుకుంటానని చెప్పారు.
అతివలపై మోజు, ఆధిపత్య పోరు
గతంలో మావో దళాల్లో ఉండే క్రమశిక్షణ, మహిళపట్ల గౌరవం అంతరించిపోవడం, అధిపత్యపోరు, అతివల పట్ల ఆసక్తి పెరిగిపోయిందని తెలుస్తోంది. దళం సభ్యుల్లోని స్త్రీల పట్ల సమభావం ప్రదర్శిస్తూ ఉండేవారని, కానీ నేడు ఇందుకు విరుద్దంగా మారిందని చెబుతున్నారు. అలాగే మావోల్లో జాతీయభావం అడుగంటిపోయి భాషాప్రభావం పెచ్చుమీరిపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒక భాషకు చెందిన మావో చెప్పిన అంశాన్ని మరో భాషకు చెందిన మావో కేవలం ప్రాంతీయ భావంతో దిక్కరించడం, తమ భాషదే ఆధిపత్యమని ప్రదర్శించడంతో వారి గుట్టురట్టయి పోలీసులకు పట్టుబడుతున్న భావన. ఒక మావో పట్టుబడితే అంత సులభంగా ఇతర మావోల ఆచూకీ చెప్పరని, అయితే ఏపీలో పట్టుబడిన మావో రాజిరెడ్డి కోవైకి స్వయంగా వచ్చి ఐదు మందిని పట్టించడం వెనుక ముఠాతగాదాలే కారణమని భావిస్తున్నారు.