బాస్‌పై వేటు?
- బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ ఔరాద్కర్ బదిలీకి రంగం సిద్ధం
- ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన సొంత పార్టీ నేతలు
- రేసులో సీనియర్ ఐపీఎస్‌లు
- సునీల్‌కుమార్‌కు అవకాశం కల్పించే యోచన
- ఔరాద్కర్ పనితీరుపై ప్రభుత్వం సీరియస్
బెంగళూరు : బెంగళూరు నగర పోలీస్ బాస్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను బదిలీకి రంగం సిద్ధమైంది. నిత్యం వివాదాలతో పాటు శాంతి భద్రతలు లోపిస్తున్నాయంటూ ఔరాద్కర్ పనితీరుపై అధికార పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఆయనను బదిలీ చేసి సమర్థుడైన మరో అధికారిని నగర పోలీస్ కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో ఔరాద్కర్ బదిలీ అనివార్యమనే నిర్ణయానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఔరాద్కర్ పనితీరుపై ప్రభుత్వం సీరియస్
కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై ఏటీఏం కేంద్రంలో కొడవలితో దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకూ పట్టుకోలేకపోవడం, లంచం తీసుకున్న ఇన్‌స్పెక్టర్ రాజేష్‌ను అరెస్ట్ చేయకపోవడం, ఏడీజీపీ రవీంద్రనాథ్‌తో అనుచిత ప్రవర్తన, యూబీ సిటీలోని బార్‌లో ఎమ్మెల్యే విజయానంద కాశ్యపనవర్ కేసు దర్యాప్తు సహా పలు కేసుల్లో నగర సీపీ ఔరాద్కర్ ఉదాసీనంగా వ్యవహరించాడన్న
బాస్‌పై వేటు?
ఆరోపణలున్నాయి. కాఫీ షాప్‌లో ఏడీజీపీ రవీంద్రనాథ్ ఫొటోలు తీసిన కేసుకు సంబంధించి కేసు దర్యాప్తును నిర్వీర్యం చేశాడన్న ఆరోపణలు సైతం ఔరాద్కర్‌పై ఉన్నాయి. ఇదే విషయాన్ని కేసు దర్యాప్తు పూర్తి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సీఐడీ అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఔరాద్కర్‌పై గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఆయన స్థానంలో మరో సీనియర్ అధికారిని నియమించాలని భావిస్తోంది.
పోటీలో పలువురు సీనియర్లు
బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ సీట్‌లో కూర్చొనేందుకు పలువురు సీనియర్ ఐపీఎస్‌లు పోటీ పడుతున్నారు. ఔరాద్కర్ కంటే ఎక్కువ సీనియారిటీ ఉన్న తొమ్మిది మంది అధికారులు ముందు వరసలో ఉన్నారు. వారిలో నీలమణి ఎస్.రాజు( కేంద్ర ప్రభుత్వ సర్వీసు), తర్వాత స్థానాల్లో కిషోర్ చంద్ర, ఎం.ఎన్.రెడ్డి, ప్రేమశంకర్, మీనా సత్యనారాయణ, ఎ.ఎం.ప్రసాద్, ప్రవీణ్‌సూద్, పి.కె.గార్గ్, గగన్‌దీప్ ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో వరుసగా అలోక్ మోహన్, మేఘరికర్, ఆర్.పి.శర్మ, పి.రవీంద్రనాథ్, సంజయ్ సహాయ్, సునీల్‌కుమార్ ఉన్నారు. హెచ్.డి.కుమార స్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కిశోర్‌చంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆయన పనిచేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఆయనను బెంగళూరు సీపీగా నియమించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడు, విశ్రాంత ఏడీజీపీ కెంపయ్య సూచన మేరకు అలోక్‌మోహన్‌ను ఆ స్థానంలో నియమించే అవకాశలు ఉన్నట్లు వదంతులూ వ్యాపించాయి. అయితే పోలీస్ శాఖలోనే అలోక్ మోహన్‌కు వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో ఆయన నియామకంపై ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదన్న వాదనలు లేకపోలేదు.
సునీల్‌కుమార్‌కు సీపీ చాన్స్?
బెంగళూరు నగర శాంతి భద్రతల విభాగంలో జాయింట్ పోలీస్ కమిషనర్‌గా పనిచేసి, మంచి పేరు తెచ్చుకుఏన్న తూకివాకం సునీల్‌కుమార్‌ను బెంగళూరు నగర పోలీస్ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజాయితీ గల అధికారిగా, వివాదరహితుడిగా సునీల్‌కుమార్‌కు పేరుంది.
మదానీకి నెల రోజుల బెయిల్
సాక్షి, బెంగళూరు : ఉగ్రవాద ప్రోత్సాహక ఆరోపణలు ఎదుర్కొంటున్న అబ్దుల్ నాసీర్ మదానీకి షరతులతో కూడిన బెయిల్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం మంజూరు చేసింది. బెంగళూరులో 2008లో జరిగిన బాంబు పేలుళ్లలో ప్రధాన సూత్రధారిగా ఉన్న మదానీ నాలుగేళ్లుగా ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనకు చికిత్స నిమిత్తం బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎ.కె.సిక్రీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం నుంచి నెల రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అదే సమయంలో మదానీ దినచర్యపై నిఘా పెంచాలని పోలీసులకు సూచించింది.