ఆహారం కోసం వ్యవసాయం...ఆరోగ్యం కోసం ఆహారం | Agriculture for food ... Food for Health | Sakshi
Sakshi News home page

ఆహారం కోసం వ్యవసాయం...ఆరోగ్యం కోసం ఆహారం

Published Wed, Dec 25 2013 4:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Agriculture for food ... Food for Health

రాయచూరు, న్యూస్‌లైన్ : ఆహారం కోసం వ్యవసాయం, ఆరోగ్యం కోసం ఆహారం.. ఈ సూత్రంతో ముందుకు వెళితే భూములు బీడుబారకుండా ఉంటాయని మైసూరుకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త, ప్రవసాంధ్ర ప్రముఖుడు డాక్టర్ ఖాదర్ అన్నారు. మంగళవారం స్థానిక కృషిక్ భారత్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో ఇష్టాగోష్టి నిర్వహించారు.

మానవులతో పాటు భూములకు  ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే అడవి వ్యవసాయం ఒక్కటే శరణ్యమన్నారు. అలాకాకుండా ఒకే పద్ధతిలో ఒకే పంట వేస్తూ పోతే భూమి నిస్సారమై పోతుందన్నారు. ఈ విషయంపై అవగాహనతో మైసూరు సమీపంలోని బిదరహళ్లిలో 8 ఎకరాల పొలంలో అటవీ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తు లాభాలు గడిస్తున్నారన్నారు. అడవుల్లో ఉన్న సూక్ష్మక్రిములతో కూడిన సత్తువ గల మట్టిని తెచ్చి భూముల్లో కలిపి వ్యవసాయం చేసే విధానమే ఇదన్నారు.

ఇక్కడి భూములు నిస్సారమైనందున అడవిలోని మట్టిని తెచ్చి సమపాళ్లలో భూమిపై చల్లితే సారవంతమవుతుందన్నారు. రసాయనిక ఎరువుల ప్రభావంతో గత పదేళ్ల నుంచి భూమి నిస్సారమైందన్నారు. వాతావరణంలో వైపరీత్యాలు చోటు చేసుకోవడంతో 30 శాతం ఉత్పత్తి తగ్గిపోతోందన్నారు. ఈ విషయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ మేధావులు దూర దృష్టితో ఆలోచించడం లేదన్నారు. తాత్కాలిక లాభాల కోసం అల్పవ్యవధిలో దిగుబడి సాధనకు అనుసరిస్తున్న విధానాల వల్ల మున్ముందు ముప్పు తప్పదన్నారు.

మొత్తం ప్రపంచంలో ఏడెనిమిది పంటలపై తప్ప ఇతరత్రా ఆసక్తి చూపడం లేదని చెప్పారు. ఇప్పటికైనా కనీసం 25 శాతం భూముల్లో అడవుల సాగుకు కృషి చేయాలన్నారు. పత్రిక సంపాదకులు మాట్లాడుతూ... ఖాదర్ తనకు కావాల్సిన పంటలన్నీ తానే పండించుకుంటూ లాభాల బాటలో నడుస్తున్నారన్నారు. కార్యక్రమంలో రామనగౌడ,  బండెప్పగౌడ, రామకృష్ణప్ప పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement